ఏది బెస్ట్ స్కూల్!
♦ జిల్లాలో ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ
♦ మొత్తం 2,400 పాఠశాలలు పరిశీలన
♦ తుదిజాబితాలో 142 స్కూళ్లకు చోటు
♦ వడపోతలో ఎంఈఓలు, ఎంపీడీఓలు
♦ తుది నిర్ణయం తీసుకోనున్న కలెక్టర్
♦ ఎంపికలో ‘త్రీ ఆర్స్’ అమలుకు ప్రాధాన్యం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. స్కూళ్ల మధ్య ఆరోగ్యవంతమైన పోటీని నెలకొల్పి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘బెస్ట్ స్కూల్స్’ ఎంపికను ప్రారంభించింది. అయితే ఇందులో ఎన్ని స్కూళ్లకు చోటు కల్పించాలన్న అంశంపై పరిమితి విధించకుండా.. పాఠశాలల్లో ప్రమాణాల అమలును పరిగణలోకి తీసుకుని ఎన్ని పాఠశాలలనైనా ‘బెస్ట్’లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. - పరిగి
అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ‘బెస్ట్ స్కూల్స్’ అవార్డులు అందజేసే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. దీనిలో భాగంగా పలు పాఠశాలలను ఎంపిక చేసి.. తుది జాబితాను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 2,400 స్కూళ్లు ఉండగా.. వీటిలో 142 పాఠశాలలను ‘బెస్ట్’కు ఎంపిక చేసింది. పరిగి మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ ప్రాథమిక, ఖుదావంద్‌పూర్ ప్రాథమికోన్నత, చిట్యాల్ ఉన్నత పాఠశాలు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. - పరిగి
బెస్ట్ స్కూళ్ల ఎంపికలో భాగంగా ఆయా మండలాల ఎంఈఓలు తమ పరిశీలన మేరకు.. ఉత్తమ ప్రమాణాలు కలిగిన పాఠశాలల జాబితా తయారు చేసి డీఈఓకు పంపించారు. అనంతరం పక్క మండలాల విద్యాధికారులను పంపించి ఎంపికైన జాబితాలోని పాఠశాలలను తనిఖీ చేయించి జాబితాను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 142 పాఠశాలలు ఎంపికయ్యాయి. అయితే ఫైనల్ జాబితా తయారు చేసే విచక్షణాధికారాన్ని ఆయా మండలాల ఎంపీడీఓలకు కట్టబెట్టారు. వీరు ఆయా స్కూళ్లను సందర్శించి తుది జాబితాను సీల్డ్ కవర్‌లో కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఇందులో ఎంపీడీఓలు సంతృప్తి చెందకపోతే పాఠశాలల పేర్లను లిస్ట్ నుంచి తొలగించే అధికారం వీరికి ఉంది.
ఈ అంశాల ప్రాతిపదికగా ఎంపిక ....
వార్షిక, పదో తరగతి ఫలితాలతో సంబంధం లేకుండా.. ఆయా పాఠశాలల్లోని మెజార్టీ విద్యార్థులకు త్రీ ఆర్స్ (చదవటం, రాయటం, ఆర్థమెటిక్స్)లో మంచి ప్రతిభ, సీసీఈ (నిరంతర మూల్యాంకణ ప్రక్రియ) అమలులో మెరుగ్గా ఉండటం, డ్రాపౌట్స్ లేకుండటం, మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలు, విద్యార్థుల ప్రగతికి సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం ఆధారంగా బెస్ట్ స్కూళ్లను ఎంపిక చేశారు.
పనికి గుర్తింపు దక్కాలనే..
మెరుగ్గా ఉన్న పాఠశాలలను గుర్తించటమనేది ఎన్నో సానుకూలాంశాలతో ముడిపడి ఉంది. బాగా పనిచేసే ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనేది డీఈఓ, కలెక్టర్లతో పాటు విద్యాశాఖ ఆలోచన. ఇదే సమయంలో పనితీరును తెలుసుకునేందుకు కూడా ఇది ఎంతో అవసరం. మున్ముందు మిగతా పాఠశాలలు కూడా బెస్ట్ స్కూళ్లుగా మారడానికి ఉపాధ్యాయులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తాం.
- హరిశ్చందర్, డిప్యూటీ ఈఓ