♦ నేడు గ్రిడ్‌కు 600 మెగావాట్ల
♦ ‘కేటీపీపీ’ ప్లాంట్ అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో తెలంగాణ ‘స్వయంసమృద్ధి’ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. వరంగల్‌జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ జెన్‌కో నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండో దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం విద్యుత్ ప్రసార వ్యవస్థ(గ్రిడ్)తో అనుసంధానం(సింక్రనైజేషన్) చేయనున్నారు. వచ్చే నెలలో ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తి తేదీ(సీఓడీ)ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,282.50 మె.వా. ఉండగా, మరో 4,600 మె.వా.కు పైగా విద్యుత్‌ను కేంద్ర విద్యుత్ కేంద్రాలు, ఇతర ప్లాంట్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేటీపీపీ-2 నిర్మాణం పూర్తయితే రాష్ట్ర సామర్థ్యం 2,882.5 మెగావాట్లకు పెరగనుంది.
అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1,200(2ఁ600) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సైతం చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చిలోగా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ చర్యలు తీసుకుంటోంది. సింగరేణి ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్ర థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,082.5 మెగావాట్లకు పెరగనుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 7 వేల మెగావాట్లకు చేరువైంది. ఈ పరిస్థితుల్లో కేటీపీపీ-2, సింగరేణి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైతే కొంత వరకు ఉపశమనం లభించనుంది.
కేటీపీపీ-2 వ్యయం తడిసి మోపెడు..
కేటీపీపీ-2 విద్యుత్ కేంద్రం వ్యయం మెగావాట్‌కు రూ.7.22 కోట్లకు పెరిగింది. రూ. 2,968.64 కోట్ల అంచనాలతో 2008 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, పనుల్లో జాప్యంవల్ల 2013 నవంబర్‌లో అంచనాలను రూ. 3,652.51 కోట్లకు పెంచారు. మళ్లీ గత జూన్‌లో రూ.4,334.11 కోట్లకు వ్యయాన్ని పెంచడంతో ప్రాజెక్టు వ్యయం తడిసిమోపెడైంది.
విద్యుత్‌లో స్వయంసమృద్ధి!
Published Mon, Oct 19 2015 12:28 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement