సాక్షి, హైదరాబాద్/జైపూర్ (చెన్నూర్): మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) 2017–18లో 91.1 శాతం విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన 18 నెలల్లోనే సంస్థ ఈ రికార్డును సొంతం చేసుకుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) జాతీయ స్థాయిలో ప్రకటించిన అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో సింగరేణి ఈ ఘనత సాధించింది.
అనేక ఏళ్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్న ఏపీ జెన్‌కో, తెలంగాణ జెన్‌కో, ఎన్టీపీసీ సంస్థలు సాధించని ఘనతను ఎస్టీపీపీ సాధించడంపై సింగరేణి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జెన్‌కో 74.7 శాతం, ఏపీ జెన్‌కో 71.6 శాతం, ఎన్టీపీసీ 78.5 శాతం విద్యుదుత్పత్తి సాధించాయి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 9,575 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, 9,004 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గజ్వేల్‌లోని పవర్‌గ్రిడ్ ద్వారా రాష్ట్రానికి సరఫరా చేసింది. తద్వారా రూ.400 కోట్ల లాభాలను ఆర్జించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇతర విద్యుత్ సంస్థల కన్నా తక్కువ ధరకే రాష్ట్ర డిస్కంలకు విద్యుత్‌ను సరఫరా చేస్తుండటంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.1,000 కోట్ల వరకు ఆదాఅయ్యాయి.
2,500మెగావాట్ల విద్యుదుత్పత్తే లక్ష్యం
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో 5వ స్థానానికి ఎదగడంపై సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను వచ్చే మే నెల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పూర్తయితే సామర్థ్యం 2,000 వేల మెగావాట్లకు చేరనుంది. సోలార్ పవర్ ప్లాంట్లపైనా సంస్థ దృష్టి సారించింది. వివిధ ప్రాంతాల్లో 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్లల్లో 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకుంది.
విద్యుదుత్పత్తిలో 5వ స్థానంలో సింగరేణి
Published Tue, Apr 3 2018 3:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment