హర్షం వ్యక్తం చేసిన సంస్థ సీఎండీ శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని యూనిట్–1 గత ఏప్రిల్‌లో 100% ఉత్పత్తి సామర్థ్యాన్ని(పీఎల్‌ఎఫ్) సాధించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1000(2్ఠ500) మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ విద్యుత్ కేంద్రంలోని 500 మెగావాట్ల తొలి యూనిట్ పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి జరిపింది. ఇదే విద్యుత్ కేంద్రంలోని 500 మెగా వాట్ల రెండో యూనిట్ కూడా గత ఫిబ్రవరిలో ఇలాగే పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిపి 100% పీఎల్‌ఎఫ్ సాధించింది. ఈ విద్యుత్ కేంద్రం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5004 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు, అందులో 4651 మిలియన్ యూనిట్లను గ్రిడ్ ద్వారా రాష్ట్రానికి సరఫరా చేశామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు.
రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా..
సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఏప్రిల్‌లో బొగ్గు రవాణాలో 16శాతం వృద్ధి సాధించి చరిత్ర సృష్టించిందని సంస్థ యాజమాన్యం తెలిపింది. బొగ్గు ఉత్పత్తిలో సైతం గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఒక శాతం వృద్ధి సాధించామంది. గతేడాది ఏప్రిల్‌లో 46.4లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 15.77 శాతం వృద్ధితో 53.7 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని తెలిపింది. గత ఐదేళ్లలో ఇంత వృద్ధి నమోదు కాలేదని పేర్కొంది. బొగ్గు ఉత్పత్తి విషయానికి వస్తే గతేడాది ఏప్రిల్‌లో 44.5 లక్షల టన్నుల ఉత్పత్తి జరగగా, ఈ ఏడాది 44.9లక్షల టన్నులకు పెరిగిందని తెలిపింది. గత ఏప్రిల్‌లో సాధించిన పురోగతిపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణిలో 100 శాతం విద్యుదుత్పత్తి
Published Wed, May 3 2017 1:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement