భయపెట్టే విద్యావిధానం మంచిది కాదు
నెల్లూరు(అర్బన్) : బిడ్డకు రెండేళ్లు పూర్తిగా నిండీ నిండక ముందే పుస్తకాలు, ప్రాజెక్టు వర్క్‌లు, మార్కులంటూ భయపెట్టే విద్యావిధానం అమలుచేయడం మంచిదికాదని రాష్ట విద్యా పరిశోధనా శిక్షణ మండలి బాధ్యులు టీవీఎస్ రమేష్ అన్నారు. నెల్లూరులోని నెల్లూరు ఆస్పత్రి సమావేశం హలులో ఆదివారం ప్రగతి శీల ప్రజా వేదిక ఆధ్వర్యంలో మాంటిస్సోరి భావనలు – విద్యావిధానంలో ఎంతవరకు అమలు చేస్తున్నాం అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నత వర్గాల కోసమే రూపొందించిన విద్యావిధానాలకు గండికొట్టిన మాంటిస్సోరి పేదపిల్లల కోసం ఆడుతూ, పాడుతూ సులభంగా నేర్చుకునే విధానాలను రూపొందించారన్నారు. ప్రత్యక్ష పరిచయం, పరిశీలన, కార్యాచరణల ద్వారా విద్యార్థి స్వతంత్య్రంగా నేర్చుకునే విధానాన్ని అమలుచేసి చూపిన మేథావి అన్నారు. బడి భయపెట్టేదిగా ఉందని, ఉపాధ్యాయుడు చెప్పేవాడుగా, విద్యార్థి పాత్ర శ్రోతగా మిగిలిపోవడం వల్లనే విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని నిరూపించారన్నారు. అందరకీ విద్య అందేవిధంగా మాంటిస్సోరి విధానాలను అమలుచేయాలన్నారు. విద్యా పరిశీలకులు టీవీ రామకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సభలో తరిమిల నాగిరెడ్డి స్కూలు ప్రధానోపాధ్యాయురాలు కొండమ్మ, ప్రగతి శీల ప్రజావేదిక కన్వీనర్ శరవణ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.