4 హత్యలు.. 3 హత్యాయత్నాలు
పదుల సంఖ్యలో దోపిడీలు
బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం
నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు
చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం
చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్‌రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు.
పోలీసులకు షాక్...
మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్‌లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్‌రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్‌ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్‌రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్‌ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్‌లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు.
మధుకరా.. భయంకరా!
Published Sun, Feb 5 2017 2:55 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
Advertisement
Advertisement