రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం | several medicine students killed in mishap in vijayawada | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం

Published Tue, Mar 15 2016 5:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం

- మృతులంతా ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు

- విజయవాడ సమీపంలో దుర్ఘటన.. చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు

 

విజయవాడ(భవానీపురం), ఇబ్రహీంపట్నం: విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాలు..

 

హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు నాలుగు రోజుల కిందట స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా అమలాపురం వెళ్లారు. సోమవారం తిరిగి అమలాపురం నుంచి ధనుంజయ ట్రావెల్స్ బస్సు(ఏపీ 28 టీబీ 1166)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో గొల్లపూడి సమీపంలోని సూరయ్యపాలేనికి వచ్చేసరికి మలుపు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు విద్యార్థులు సీట్ల కింద ఇరుక్కుపోయారు.

 

ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతిచెందారు. డ్రైవర్, ముగ్గురు విద్యార్థుల  మృతదేహాలు సీట్ల కింద చిక్కుకుపోయాయి. మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతిచెందిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.

మృతుల వివరాలు: మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య

విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం మంగళగిరి సమీపంలోని హాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడే భోజనాలు చేశారని సమాచారం. బస్సు డ్రైవర్ ను వేముల వెంకట శివయ్య గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనా స్థలికి ప్రిన్సిపాల్ ప్రభాకర్, డీఎంఈ రమణి చేరుకున్నారు. విద్యార్థులను ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వివరాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించాల్సిన నెంబర్లు:
86868 64656, 94407 52310, 040 24653992

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement