అతివల భద్రతకు షీ–సేఫ్ యాప్
సాక్షి, సిటీబ్యూరో: అతివల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ వెస్ట్ పోలీసులు ‘షీ–సేఫ్’ పేరిట యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులతో పాటు మహిళలకుSకనీస రక్షణ కల్పించడమే ధ్యేయంగా సొసైటీఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) దీనిని రూపొందించింది. పైలట్ పద్ధతిన మరో రెండు వారాల్లో దీనిని అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా అపదలో ఉన్న మహిళలతో పాటు ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితితో ఉన్న వారిని తక్షణం రక్షించేందుకు వీలుంటుందని పోలీసులు భావిస్తున్నారు.
అమ్మాయిలు తమ సెల్‌ఫోన్లలో ఈ యాప్‌ను నిక్షిప్తం చేసుకుని.. తమ వివరాలను నమోదు చేసుకుంటే చాలు. సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు ఆ వివరాలన్నింటినీ డయల్ –100తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తారు. ఈ యాప్‌ను మహిళలు తమ సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుంటే నమ్మకమైన నేస్తం వారి వెంట ఉన్నట్టేనని పోలీసులంటున్నారు.
ఎక్కడున్నా వచ్చేస్తారు...
ఇప్పుడు చాలా మంది ఆండ్రాయిడ్ సౌకర్యం ఉన్న ఫోన్లనే వాడుతుండటంతో ఆయా ఫోన్లను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వివరాలు పొందుపరిచిన అమ్మాయిలు ఆపద సమయాల్లో యాప్‌లో ఉన్న మీట నొక్కితే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి సందేశం వెళ్లేలా ఫీచర్స్ రెడీ చేశారు. బాధితులు వీడియోలు, ఫొటోలు పంపించవచ్చు. ఒంటరి ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితి ఉంటే అక్కడి ప్రదేశాన్ని వీడియో తీసి పంపడంతో పాటు వాయిస్ రికార్డు చేసి పోలీసులకు చేరవేసేలా ఫీచర్‌ను సిద్ధం చేశారు.
వీటన్నింటితో పోలీసులు అప్రమత్తమై బాధితురాలి సెల్‌ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేసి ఎక్కడుందో తెలుసుకొని సమీపంలో ఉన్న పోలీసులను అక్కడికి పంపిస్తారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్లలోని పెట్రోలింగ్ వాహనాలన్నింటిలోనూ జీపీఎస్ ఉండటంతో బాధితురాలున్న చోటుకు సమీప గస్తీ వాహనానికి సమాచారమిస్తారు. ఆమె ఫోన్ అందుబాటులో ఉంటే తాము ఎంతసేపట్లో ఘటనాస్థలికి చేరుకుంటామో చెప్తారు. ఎవరైనా మహిళను కిడ్నాప్‌చేసి ఆమె సెల్‌ఫోన్‌ను పడేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనుగొంటారు. అలాగే, అక్కడి పరిసరాల్లోని దుండగుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కూడా పట్టుకుంటారు.
త్వరలోనే అందుబాటులోకి...
మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ పోలీసులు సరికొత్తగా షీ సేఫ్ యాప్ రూపొందించేందుకు ఎంతో సహకరించారు. అభయలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటంతో పాటు మహిళా ఉద్యోగులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే ఇది భిన్నమైనది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తాం. షీ సేఫ్ యాప్ సెల్‌ఫోన్‌లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తాం.
– భరణి కుమార్ , కార్యదర్శి, ఎస్‌సీఎస్‌సీ