ముగిసిన నాటిక పోటీల సంరంభం
ముగిసిన నాటిక పోటీల సంరంభం
Published Fri, May 26 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
భీమవరం : సినీ, టీవీ రంగాల వల్ల కనుమరుగైపోతున్న నాటక రంగానికి కళా పరిషత్‌లే ఊపిరిపోశాయని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో ఐదురోజులుగా జరిగిన చైతన్య భారతి సంగీత నృత్య, నాటక పరిషత్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జాతీయ స్థాయి నాటిక పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో సినీ హీరో సుమన్‌ను కళాకారులు సత్కరించారు. అనంతరం జరిగిన సభలో శివరామరాజు మాట్లాడారు. నాటక రంగ పునరుజ్జీవనానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు కేశిరాజు సంస్కృతి, గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా నాటిక పోటీల్లో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించారు. ఈ సభకు నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షత వహించగా మంతెన వెంకటనర్సింహ సీతారామరాజు, మానాపురం సత్యనారాయణ, డాక్టర్ పి.పెర్సీ, వర్ధమాన సినీ హీరో అల్లు వంశీకృష్ణ, దర్శకుడు సంతోష్ ఇట్టమళ్ల, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, మంతెన రాంకుమార్‌రాజు, కృత్తివెంటి సత్యకుమార్, కాగిత వెంకటరమణారావు, బొండా రాంబాబు, బటిప్రోలు శ్రీనివాసరావు, పేరిచర్ల లక్ష్మణవర్మ, బుర్రా పద్మనాభం, విన్నకోట వెంకటేశ్వరరావు, బుద్దాల వెంకటరామారావు, వంగా నర్సింహరావు, చవ్వాకుల సత్యనారాయణమూర్తి, జవ్వాది దాశర«థి శ్రీనివాసరావు, గంటా ముత్యాలరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు
శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకలూరు) ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ప్రథమ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. విజేతల వివరాలను న్యాయ నిర్ణేతలు కేఎస్‌టీ సాయి, కోనా హేమచంద్, మానాపురం సత్యనారాయణ గురువారం విలేకరులకు వెల్లడించారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లివారి ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా పండు క్రియేష న్స్ కొప్పోలు వారి ‘అమ్మ సొత్తు’ ఎంపికయ్యాయి.
ఉత్తమ నటులు, సాంకేతిక నిపుణులు వీరే..
ఉత్తమ దర్శకుడిగా కేకేఎల్ స్వామి (తేనేటీగలు పగబడతాయి), ఉత్తమ విలన్‌గా వి.కృష్ణమూర్తి(సైకత శిల్పం), ఉత్తమ రచయితగా కావూరి సత్యనారాయణ (శ్వేతపత్రం), ఉత్తమ నటిగా ఎస్.అమృత వర్షిణి (గోవు మా లచ్చిమి). ఉత్తమ నటుడిగా పి.బాలాజీనాయక్(నాన్నా నువ్వో సున్నావా?) బహుమతులు అందుకున్నారు. ఉత్తమ కారెక్టర్ నటిగా టి.లక్ష్మి (కేవలం మనుషులం), ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా బి.లక్ష్మయ్య(ఆగ్రహం), ద్వితీయ ఉత్తమ నటిగా డి.సరోజ(ఆగ్రహం), ద్వితీయ ఉత్తమ నటుడిగా గోపరాజు రమణ (చాలు ఇక చాలు), ఉత్తమ సహాయ నటిగా మాధవి (నాన్నా నువ్వో సున్నావా?), ఉత్తమ సహాయ నటుడిగా బి.నాగేశ్వరరావు (అమ్మసొత్తు), ఉత్తమ హాస్య నటుడిగా పీఎన్‌ఎం కవి(ప్రియమైన శత్రువు) ఎంపికయ్యారు. ఉత్తమ మేకప్ మేన్‌గా ఎస్.రమణ (తేనేటీగలు పగబడతాయి ) ఉత్తమ సంగీతం పి.రాజు(నాన్న నువ్వో సున్నావా?) ఉత్తమ బాల నటుడుగా ఎ.పవన్‌కుమార్ (శ్వేతపత్రం)బహుమతులు అందుకున్నారు. ప్రత్యేక జ్యూరీ అవార్డులకు జి.దిలీప్‌కుమార్, కేవీ సుబ్బారాయుడు ఎంపికైనట్టు న్యాయనిర్ణేతలు సాయి, హేమచంద్, సత్యనారాయణ వెల్లడించారు.
Advertisement