
‘అడ్డదారి’ అనుమతి
ఇసుక రవాణాలో అక్రమాలు
లబ్ధిదాలరుల పేరుతో వ్యాపారుల దోపిడీ
అధికారులపై మండిపడుతున్న ప్రజలు
మునుగోడు: అక్రమ ఇసుక రవాణాపై పోలీస్‌లు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపడంతో గహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను అరికట్టాలని అధికారులు చర్యలు చేపట్టగా.. అసలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు కొంత సడలింపు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఇసుక వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు అధికారులతో చేతులు కలిపి యధేచ్ఛగా ఇసుక రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
వారంలో రెండు రోజులు...
మండలంలోని మునుగోడు, చీకటిమామిడి, కొరటికల్, ఇప్పర్తి తదితర గ్రామాల నుంచిlఇసుక రవాణా చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతి సోమ, గురువారాల్లో అనుమతులు ఇస్తున్నారు. అయితే ఇసుక అవసరమైన ఇంటి యజమాని దరఖాస్తు రాసుకొని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శితో ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నట్లు ధ్రువీకరణ పొంది తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి ఆయన టైంమ్‌తో కూడిన అనుమతి ఇస్తారు. అయితే దానిని ఆసరాగా చేసుకున్నlకొంతమంది వ్యాపారులు సంబంధిత మండల అధికారిని మచ్చిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బినామీ వ్యక్తుల పేర్ల మీద దరఖాస్తు చేసుకొని ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే అనుమతులు పొందుతున్నారు. అలా అడ్డదారిలో అనుమతులు ఇచ్చినందుకు సదరు అధికారికి ఒక్కోSట్రాక్టర్ యజమాని రూ.750 చొప్పున ముడుపులు ఇస్తున్నారని సమాచారం. ఇలా అనుమతులు పొందినవారు వాగుల నుంచి ఇసుకను ఎత్తుకొని పరిసర మండలాలైనా చిట్యాల, నారాయణపురం, నార్కట్‌పల్లి మండలాలకు తరలించి ఒక్కో ట్రిప్పు రూ.3500 నుంచి రూ.4 వేల వరకు విక్రయింస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిజమైన లబ్ధిదారులు ఇసుక అనుమతి కావాలని దరఖాస్తు చేసుకుంటే సదరు అధికారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతులు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాక డబ్బులు ఇవ్వని ట్రాక్టర్ యజమానులపై వాల్టా చట్టం కేసులను నమోదు చేస్తున్నాడని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యాపారులకు అండగా నిలిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
డబ్బులు ఇచ్చినవారికేSఅనుమతులు
– సురిగి చలపతి, సీపీఐ మండల కార్యదర్శి
ఇసుక అవసరం ఉందా లేదా అనేది కాదు. తమకు డబ్బులు ఎవ్వరూ ఇస్తే వారికే రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా అనుమతులకు వెళ్లినవారిపై అధికారి మండిపడుతూ రోజుల తరబడి తిప్పుతున్నారు. ఈ రకంగా కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతులు దక్కుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆందోళనలు చేపడుతాం.
ఆరోపణల్లో నిజం లేదు
–వై.శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్
అక్రమ వ్యాపారులను ప్రొత్సహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. లబ్ధిదారులు ఆ గ్రామ కార్యదర్శితో ధ్రువీకరణ పత్రం తీసుకోని వస్తేనే అనుమతులు ఇస్తున్నాం. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని జరిమానాలు విధిస్తున్నాం. ఇకా నుంచి ఇంటి యజమానితో పాటు ఆ గ్రామ వీఆర్‌ఏను వెంట ఉంచి రవాణా చేసేలా ఆదేశిస్తాం.