షోగన్‌ | Show 'gun' | Sakshi
Sakshi News home page

షోగన్‌

Published Sat, Sep 10 2016 4:52 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

షోగన్‌ - Sakshi

షోగన్‌

* రెయిన్‌ గన్లు.. ప్రచార ఆర్భాటమే
నీళ్లే లేవు.. కాపాడింది ఎక్కడ?
రైతులపైనే నీటి భారం
అన్నదాతకు ఖర్చు తడిసి మోపెడు
 
సాక్షి, అమరావతి బ్యూరో : సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను రెయిన్‌ గన్‌ల ద్వారా కాపాడేశామంటూ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఉత్త ఆర్భాటమేనని రైతులు మండిపడుతున్నారు. నీళ్లే లేకుండా రెయిన్‌ గన్‌లతో ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నీటిని సమకూర్చుకోవాల్సిన బాధ్యత రైతులపైనే పెడితే ఖర్చు భరించటం కష్టసాధ్యమని చెబుతున్నారు. 
 
రైతులకు అదనపు భారమే..
ఈ ఏడాది ఖరీఫ్‌లో జూలై చివరి నాటికి 3,64,215 ఎకరాల్లో అపరాలు, ప్రత్తి, మిరప, వరి, చిరు ధాన్యాల పంటలను రైతులు సాగు చేశారు. జూలై చివరి నుంచి దాదాపు నెల రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో, పంటలు ఎండు దశకు చేరుకొన్నాయి. వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పూర్తిగా పంటలు వాడిపోయాయి. ఎండుతున్న పంటలను కాపాడేందుకు వీలుగా ప్రభుత్వం రెయిన్‌గన్స్‌ను సిద్ధం చేసింది. పంటలను కాపాడాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాకు 754 రెయిన్‌ గన్స్, 754 స్ప్రింక్లర్లు, 565 ఆయిల్‌ ఇంజన్లలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నీటిని మాత్రం రైతులే సమకూర్చుకోవాలని మెలిక పెట్టింది. దీంతో రైతులకు శిరోభారం మొదలైంది. నీటిని సమకూర్చుకోవడం అదనపు భారంగా మారింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీరు దొరకటం కష్టమవటంతో పంటలను కాపాడుకోవడం కష్టసాధ్యమైంది. రెయిన్‌ గన్‌ల ద్వారా జిల్లాలో 16,642 ఎకరాల్లో పంటలు కాపాడినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మరి మిగిలిన పంటల సంగతేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. 
 
వినియోగం వెనుక కష్టాలెన్నో...
ప్రభుత్వం రెయిన్‌ గన్స్‌ ఆయా మండల వ్యవసాయ శాఖ కేంద్రాల్లో ఉంచుతోంది. పంట ఎండిపోతున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించుకొంటే అక్కడ అందుబాబులో ఉన్న రెయిన్‌గన్స్, పైపులు, ఇంజన్‌ను రైతు పొలాల వద్దకు పంపుతారు. నీటిని మాత్రమే రైతులే సమకూర్చుకోవాలి. నీటి వనరులు దూరంలో ఉన్నప్పుడు అందుకు అవసరమైన పైపులు, డీజిల్‌ను కూడా రైతులే సమకూర్చుకోవాలి. పంటలకు నీటిని ఇచ్చిన తరువాత రెయిన్‌గన్స్, పైపులు తిరిగి స్వంత ఖర్చులతో వ్వవసాయ శాఖ కార్యాలయాలకు చేర్చాలి. నీరు దొరక్కపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని అన్నదాతలు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఓ ఎకరా పంటను ఓ మోస్తరుగా తడిపేందుకు 20 వేల లీటర్లు, పూర్తిగా తడిపేందుకు 40 వేల లీటర్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కనీసం దాదాపు నాలుగు ట్యాంకర్ల నీరు అవసరమవుతోంది. ఇందుకోసం దాదాపు రూ.4 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది రైతుకు తలకు మించిన భారంగా మారనుంది. రెయిన్‌ గన్‌ ద్వారా రెండు గంటల్లోనే ఎకరా పంటకు నీరు ఇవ్వవచ్చునని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో వాటిని సిద్ధం చేసుకోవడం, మార్చుకోవడం వంటి కారణాలతో నాలుగైదు ఎకరాలకు మాత్రమే నీటిని ఇవ్వగలుగుతున్నారు.
 
కొరవడిన సమన్వయం...
రెయిన్స్‌ గన్స్‌ వినియోగంలో వ్యవసాయ శాఖ, ఏపీఎంఐపీ, ఆగ్రోస్‌ సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. రెయిన్‌గన్‌ల నిర్వహణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగుతుండగా, పైపులను ఏపీఎంఐపీ వారు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ శాఖ సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వారి పనులు కుంటుపడుతున్నాయి. మొత్తం మీద ఈ మూడు శాఖల మధ్య సమన్వయం కొరవడటం అన్నదాతలకు ఇబ్బందిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement