సబ్‌కలెక్టరేట్ ఎదుట ఎండిన వేరుశెనగ పంటను దగ్ధం చేస్తున్న రైతులు
రెయిన్‌గన్స్‌తో రైతుల నోట మట్టి
వేరుశెనగ పంట దగ్ధం
మదనపల్లె రూరల్:
ప్రభుత్వం పంట కాపాడుతుందన్న ఆశతో వేచి చూసి చివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కర్షకులు రోడ్డెక్కారు. పచ్చగా పండుతుందనుకున్న పంట ఎండిపోతే చూడలేక, తీసుకువచ్చి సబ్‌కలెక్టరేట్ ఎదుట తగులబెట్టి తమ నిరసన తెలియజేశారు. నిమ్మనపల్లె మండలానికి చెందిన బాలేపల్లి, రామచంద్రపురం, పిట్టావాండ్లపల్లె, చెన్నంవారిపల్లె, రెడ్డివారిపల్లె, నిమ్మనపల్లె గ్రామాల రైతులు బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎండిన వేరుశెనగ చెట్లను తీసుకువచ్చి పంట కాపాడటంలో ప్రభుత్వవైఫల్యంపై నిరసన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె మండల రైతు సంఘనాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ పంట ప్రారంభంలో వర్షాలు విరివిగా కురవడంతో ఎంతో ఆశతో పంటసాగు చేశామన్నారు. వర్షాభావంతో పంట ఎండుతున్న సమయంలో కాకుండా పూర్తిగా ఎండిపోయిన తరువాత ప్రభుత్వం మేలుకోవడంతో పంటను కాపాడుకోలేకపోయామన్నారు. 2014–15 సంవత్సరంలో వేరుశనగ పంట ఇన్‌పుట్ సబ్సిడీ, రైతుల నుంచి కట్టుకున్న క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదన్నారు. ప్రస్తుతం రెయిన్‌గన్స్ పేరుతో ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు పథకం రూపొందించుకుని తమను నిలువునా నట్టేట ముంచుతున్నారని వాపోయారు. రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్స్ కొనుగోలుకు వెచ్చించిన రూ. కోట్లు తమకు ఇచ్చి ఉంటే కష్టాలు తీరేవన్నారు. వేరుశెనగ పంట నష్టంపై ప్రభుత్వం తీరు రైలు వెళ్లాక టికెట్టు కొన్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. వెంటనే వ్యవసాయశాఖ అ«ధికారులతో పంట నష్టం అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలన్నారు. నాలుగు రోజుల లోపు పంటనష్ట పరిహారంపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే రైతులందరూ కార్యాలయాల ఎదుట నిరాహారదీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎండిన వేరుశెనగ పంటను కార్యాలయం ఎదుట తగులబెట్టారు. సబ్ కలెక్టరేట్‌లో ఏవో సురేంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు చేసిన ధర్నాకు స్థానిక సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మాలమహానాడు యమలాసుదర్శనం, గుండాల మనోహర్ తదితరులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.