శుభంకరి...కాళరాత్రి దుర్గ
మహానంది: రూపంలో భయకంరం ఉన్నప్పటికీ కాళరాత్రి దుర్గ ఎల్లప్పుడు శుభఫలితాలను ఇస్తూ ఉంటుంది. భయంకర రూపంలో ఉన్న శ్రీ కాళరాత్రి దుర్గాదేవి శత్రువులను సంహరిస్తుందని, భక్తులను మాత్రం ఎల్లవేళలా కాపాడుతుంటుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహానంది క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు కుడిచేతులు, రెండు ఎడమచేతులను కలిగిన ఈమె ఒక కుడిచేతిలో వరముద్ర, మరొక కుడిచేతిలో అభయముద్రలను కలిగి భక్తులకు వరాలిస్తుంటుంది. అలాగే ఎడమచేతిలో ఇనుప ముళ్ల ఆయుధం, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్ని ధరించి శత్రువులను సంహరిస్తుంటుందని తెలిపారు. ఉత్సవాల్లో నంద్యాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అశ్వవాహనంపై గ్రామోత్సవం
శ్రీ కాళరాత్రిదుర్గ అమ్మవారిని అశ్వవాహనంపై అధిష్టింపజేసి శుక్రవారం రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని శుభంకరీ...నమోస్తుతే అంటూ వేలవందనాలు సమర్పించారు. దేవస్థానం ఈఓ శంకర వరప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.