కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యుమోనియాతో ఆరు నెలల పసికందు చనిపోయాడు. అయితే, వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన చేశారు. బాధితుని కథనం ప్రకారం... పోరుమామిళ్ల మండలం టేకులపేటకు చెందిన ప్రసన్నకుమార్, మరియమ్మ దంపతులకు తమ ఆరునెలల కుమారుడు ఉన్నాడు. న్యుమోనియా సోకటంతో ఈ నెల 27వ తేదీన కడపలోని శివయోగి చిన్న పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ పర్యవేక్షణలో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. చిన్నారి కోలుకోకపోవటంతో బుధవారం రాత్రి డాక్టర్‌ను సంప్రదించారు.
అయితే, బాబు బాగానే ఉన్నాడని, మీకేమైనా అయితే పరీక్షలు చేయించుకోండంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. ఇంతలోనే తెల్లవారు జామున మూడు గంటలకు పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందాడు. దీనిపై తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను, అద్దాలను ధ్వంసం చేశారు. తాము ఆస్పత్రికి వచ్చిన నాటి నుంచి సిబ్బంది సరిగా స్పందించటం లేదని ఆరోపించారు. తమ చిన్నారి మృతికి వైద్యుడే కారణమని పేర్కొన్నారు. ఈ విషయమై గురువారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారి మృతి: ఆస్పత్రి వద్ద ఆందోళన
Published Thu, Dec 31 2015 7:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM
Advertisement