ఆస్పత్రుల ఎదుట ఆందోళన   | People Protest At Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల ఎదుట ఆందోళన  

Published Wed, Aug 1 2018 3:20 PM | Last Updated on Wed, Aug 1 2018 3:20 PM

People Protest At Hospital  - Sakshi

నకిరేకల్‌లో మృతి చెందిన చిన్నారి రమ్యతో కుటుంబీకులు  

నార్కట్‌పల్లి(నకిరేకల్‌) : ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌లో చోటుచేసుకున్నాయి.  బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వర్రె లక్ష్మి పార్వతమ్మ రెండో కాన్పు పురిటినొప్పులు వస్తుండడంతో సోమవారం భర్త వర్రె సత్తీష్, బంధువులు స్థానిక కామినేని ఆస్పత్రిలో చేర్పించారు.

డాక్టర్‌ పరీక్షించి ఆపరేషన్‌ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికి తల్లికి బ్లీడింగ్‌ అవుతుందని, అందుకు ఆపరేషన్‌ చేయాలని చెప్పి రెండుసార్లు ఆపరేషన్‌ చేశారు. తల్లి కన్నుమూసింది. వైద్యులు సక్రమంగా చికిత్స అందించకపోవడం మూలంగానే తమ భార్య మృత్యువాతపడిందని భర్త ఆరోపించారు.

లక్ష్మిపార్వతిని చూసేందుకు వచ్చిన బంధువులు దాదాపు గంట సేపు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఎస్‌ఐ గోవర్ధన్, సీఐ క్యాస్ట్రోరెడ్డిలు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందినట్లు మృతురాలి భర్త  ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

నకిరేకల్‌లో చిన్నారి..

నకిరేకల్‌ : ఆస్పత్రిలోని డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మూడు నెలల పసిపాప మృతి చెందిందని నకిరేకల్‌లో మంగళవారం ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆస్పత్రి ఎదు ట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని తాటికల్‌రోడ్డుకు చెందిన చినేని జానయ్య, శైలజకు చెందిన రమ్య(3నెలలు)కు సోమవారం వాంతులు విరేచనాలతో పాటు జ్వరం రావడంతో నకిరేకల్‌లోని సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాలకు తీసుకువచ్చారు.

సదరు డాక్టర్‌ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి పంపించారు. చిన్నారి రమ్య మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం ఉదయం అదే ఆస్పత్రికి తీసుకురాగా సదరు వైద్యశాల డాక్టర్‌ పాప పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుంబీకులు సదరు డాక్టర్‌మీద ఆందోళన వ్యక్తం చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా మృతి చెందినట్లు చెప్పడంతో రమ్య తల్లిదండ్రులు, కుటుంబీకులు సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల మా చిన్నారి మృతి చెందిందని వాపోయారు. ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు.

సంఘటన స్థలానికి నకిరేకల్‌ సీఐ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీ సులు చేరుకుని చిన్నారి రమ్య తల్లిదండ్రులను, కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై సదరు డాక్టర్‌ నాంపల్లి శ్రీనివాస్‌ను వివరణ కోరగా చిన్నారి మృతికి సంబంధించి వైద్యం విషయంలో తన తప్పేమి లేదన్నారు. మూడు నెలల చిన్నారుల విషయంలో ఒక్కొక్కరికి శ్వాసకు సంబంధించిన ప్రభావాలు రావడంతో చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement