6వ యూనిట్‌ను పరిశీలిస్తున్న జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజం, అధికారులు
నెలాఖరునాటికి ఆరో యూనిట్
Published Sat, Sep 10 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
– విద్యుదుత్పత్తికి చురుగ్గా ఏర్పాట్లు
–జన్‌కో డైరెక్టర్ వెంకటరాజం వెల్లడి
– ఇప్పటికే ఐదు యూనిట్ల ద్వారా ఉత్పత్తి సక్సెస్
ఆత్మకూర్: ఆత్మకూర్ మండల పరిధిలోని మూలమల్ల, జూరాల గ్రామాల శివారులో నిర్మిస్తున్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జన్‌కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం బందం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఐదు యూనిట్ల ద్వారా ఇది వరకే విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. 6వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మౌలిక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ నెల చివరిలోపు సీఓడీ పరీక్షలు నిర్వహించి ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎగువ జూరాల నుంచి వచ్చే నీటితో విద్యుత్‌ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అక్కడి నుంచి నీరు రాకపోతే విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేమన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు. దిగువ జూరాలలో తయారయ్యే విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సొంతమని చెప్పారు. ఎగువ జూరాలలో తయారయ్యే విద్యుత్‌లో కర్ణాటకకు సగభాగం వాటా ఉంటుందని తెలిపారు.
ఆరు యూనిట్లు సిద్దం అవుతున్న నేపథ్యంలో జన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సందర్శిస్తారని అనంతరం ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రితో సమావేశమై అధికారికంగా ప్రారంభించేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుందన్నారు. అనంతరం 6వ యూనిట్ మరమ్మత్తుల పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో కన్సల్టెంట్ దివాకర్, సీఈ శివాజీ, ఎస్‌ఈలు శ్రీధర్, సురేష్, ఈఈలు రామక్రిష్ణారెడ్డి, పవన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
Advertisement