నెలాఖరులోపు సర్వే పూర్తి
నెలాఖరులోపు సర్వే పూర్తి
Published Thu, Sep 8 2016 5:14 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
కలెక్టర్ కాంతిలాల్ దండే
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేను జిల్లాలో వేగవంతం చేసి ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం గుంటూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల కమిషనర్లతో సమావేశమయ్యారు. సర్వే ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా పలు మున్సిపాల్టీల్లోని జనాభాలో కేవలం 10 శాతం సర్వే చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మూడు వారాలు మాత్రమే గడువున్న దృష్ట్యా కమిషనర్లు ప్రతి వారానికి ఎన్యూమరేటర్లకు లక్ష్యం విధించి, నిరే్ధశిత గడువు లోగా పూర్తి చేయించాలని సూచించారు. సర్వే సక్రమంగా నిర్వహించని, గైర్హాజరు అవుతున్న ఎన్యూమరేటర్లను గుర్తించి వారి వివరాలు పంపితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని 12 మున్సిపాల్టీలు, గుంటూరు నగరపాలక సంస్థతో కలిపి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో సర్వేను మరింత వేగవంతం చేయాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 43 శాతం వరకూ సర్వే పూర్తవగా, పట్టణ ప్రాంతాల్లో 27 శాతం జరిగినట్లు రికార్డులను బట్టి అర్థమవుతోందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలాఖరుకు జిల్లా వ్యాప్తంగా సర్వే పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె. నాగబాబు, నగరపాలక సంస్థ కమిషనర్‌ఎస్. నాగలక్ష్మి, అదనపు కమిషనర్ కృష్ణ కపర్ధి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement