month ending
-
నెలాఖరునాటికి ఆరో యూనిట్
– విద్యుదుత్పత్తికి చురుగ్గా ఏర్పాట్లు –జన్కో డైరెక్టర్ వెంకటరాజం వెల్లడి – ఇప్పటికే ఐదు యూనిట్ల ద్వారా ఉత్పత్తి సక్సెస్ ఆత్మకూర్: ఆత్మకూర్ మండల పరిధిలోని మూలమల్ల, జూరాల గ్రామాల శివారులో నిర్మిస్తున్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం బందం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఐదు యూనిట్ల ద్వారా ఇది వరకే విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. 6వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మౌలిక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ నెల చివరిలోపు సీఓడీ పరీక్షలు నిర్వహించి ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎగువ జూరాల నుంచి వచ్చే నీటితో విద్యుత్‌ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అక్కడి నుంచి నీరు రాకపోతే విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేమన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు. దిగువ జూరాలలో తయారయ్యే విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సొంతమని చెప్పారు. ఎగువ జూరాలలో తయారయ్యే విద్యుత్‌లో కర్ణాటకకు సగభాగం వాటా ఉంటుందని తెలిపారు. ఆరు యూనిట్లు సిద్దం అవుతున్న నేపథ్యంలో జన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సందర్శిస్తారని అనంతరం ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రితో సమావేశమై అధికారికంగా ప్రారంభించేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుందన్నారు. అనంతరం 6వ యూనిట్ మరమ్మత్తుల పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో కన్సల్టెంట్ దివాకర్, సీఈ శివాజీ, ఎస్ఈలు శ్రీధర్, సురేష్, ఈఈలు రామక్రిష్ణారెడ్డి, పవన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. -
నెలాఖరులోపు సర్వే పూర్తి
కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేను జిల్లాలో వేగవంతం చేసి ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం గుంటూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల కమిషనర్లతో సమావేశమయ్యారు. సర్వే ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా పలు మున్సిపాల్టీల్లోని జనాభాలో కేవలం 10 శాతం సర్వే చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మూడు వారాలు మాత్రమే గడువున్న దృష్ట్యా కమిషనర్లు ప్రతి వారానికి ఎన్యూమరేటర్లకు లక్ష్యం విధించి, నిరే్ధశిత గడువు లోగా పూర్తి చేయించాలని సూచించారు. సర్వే సక్రమంగా నిర్వహించని, గైర్హాజరు అవుతున్న ఎన్యూమరేటర్లను గుర్తించి వారి వివరాలు పంపితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని 12 మున్సిపాల్టీలు, గుంటూరు నగరపాలక సంస్థతో కలిపి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో సర్వేను మరింత వేగవంతం చేయాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 43 శాతం వరకూ సర్వే పూర్తవగా, పట్టణ ప్రాంతాల్లో 27 శాతం జరిగినట్లు రికార్డులను బట్టి అర్థమవుతోందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలాఖరుకు జిల్లా వ్యాప్తంగా సర్వే పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె. నాగబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ఎస్. నాగలక్ష్మి, అదనపు కమిషనర్ కృష్ణ కపర్ధి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రూ.34 కోట్లు.. 5 మెగావాట్లు
గొల్లగూడెం (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో పోలవరం గట్టుపై జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కోసం పోలవరం–తాడిపూడి కాలువల మధ్య ఉన్న నీటిపారుదల శాఖ స్థలం 30 ఎకరాలను లీసుకు తీసుకున్నారు. రూ.34 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్ట్ సామర్థ్యం 5 మెగావాట్లు. దీనిలో భాగంగా 5 మెగావాట్ల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పుతున్నారు. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేశారు. ఇప్పటికీ మూడు మెగావాట్లకు సంబంధించి ప్యానల్ పనులు పూర్తికాగా రెండు మెగావాట్లకు సంబంధించి పనులు వేగిరపర్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొలగాని వీవీఎస్ మూర్తి తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం.. సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఐదు మెగావాట్ల విద్యుత్‌ను గొల్లగూడెం 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. బోర్ల కింద వ్యవసాయం చేసే రైతులకు, గృహ వినియోగదారులకు, పరిశ్రమలకు సోలార్ విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. దీని ద్వారా విద్యుత్ కొరత తీరడంతో పాటు లో ఓల్టేజీ సమస్య ఉండదని అధికారులు అంటున్నారు. సీఎంతో ప్రారంభానికి సన్నాహాలుప్రారంభించటానికి సన్నాహాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ముఖ్యమంతి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభిం చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్ర్ర గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. పోలవరం– తాడిపూడి కాలువల మధ్య నిర్మించడంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు అంటున్నారు. కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటి ఆదర్శవంతమైన నిర్మాణంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. దేశంలో తొలి ప్రాజెక్ట్‌గా.. దేశంలో కాలువ గట్టుపై నిర్మిస్తున్న తొలి సోలార్ ప్రాజెక్ట్‌గా ఇది నిలువనుంది. ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.7.5 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. కాలువ గట్టుపై నిర్మించడం వల్ల ఈ సబ్సిడీ వచ్చింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెలాఖరుకు పూర్తిచేయాలని ప్రణాళిక అమలుచేస్తున్నాం. ప్రాజెక్ట్ ద్వారా నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. –కొలగాని వీవీఎస్ మూర్తి, పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్