విజ్ఞాన ప్రదర్శనలతో నైపుణ్యాభివృద్ధి
విజ్ఞాన ప్రదర్శనలతో నైపుణ్యాభివృద్ధి
Published Tue, Mar 21 2017 11:11 PM | Last Updated on Tue, Oct 9 2018 7:43 PM
- త్వరలో రాష్ట్ర క్యాన్సర్ యూనిట్ కర్నూలులో ఏర్పాటు
– డీఎంఈ డాక్టర్ సుబ్బారావు
కర్నూలు (హాస్పిటల్): విజ్ఞాన ప్రదర్శనలతో వైద్యవిద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజి 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలతో వైద్య విద్యార్థుల్లో సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. ఇప్పటి విద్యార్థులకు ఈ రెండు విషయాల్లో నైపుణ్యాలు చాలా అవసరమని చెప్పారు. వారు వైద్య విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చాక ఎవరితో ఎలా మాట్లాడాలో, రోగులతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అంశాల గురించి వారు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్‌లతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలుగుతుందన్నారు.
శరీర నిర్మాణం, వ్యాధులు, దాని నివారణ, చికిత్స గురించి తెలుస్తాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో వార్షికోత్సవాలు, సైన్స్ ఎగ్జిబిషన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించే విషయం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు లేవని, దీనివల్ల డీఎం, ఎంసీహెచ్ సీట్లకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి చోటా ఎంసీహెచ్ (మాతాశిశు భవనం)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఇటీవల ఓపీ బాగా పెరిగిందన్నారు. అనంతపురం మెడికల్ కళాశాలలో సూపర్‌స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించామని, దీనివల్ల కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై భారం తగ్గుతుందని చెప్పారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో త్వరలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్, గైనిక్ విభాగాల్లో ప్రస్తుతమున్న నాలుగు యూనిట్ల స్థానంలో ఆరు యూనిట్లు పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. రాష్ట్ర క్యాన్సర్ ఇన్సిట్యూట్‌ను కర్నూలులో త్వరలో ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఏఆర్‌ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్లు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, చంద్రశేఖర్, శంకరశర్మ, కైలాష్‌నాథ్‌రెడ్డి, కృష్ణనాయక్, శ్రీహరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement