బదిలీల్లో నినాదాల హోరు.:!
- కౌన్సెలింగ్‌కు అనుమతి నిరాకరించడంతో అడ్డుకున్న సంఘాలు
- స్కూల్ అసిస్టెంట్ ఎల్‌పీలకు ముగిసిన కౌన్సెలింగ్
భానుగుడి(కాకినాడ): ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్ మూడోరోజు నినాదాలు హోరెత్తింది. కౌన్సెలింగ్ హాల్‌లోకి ఉపాధ్యాయ సంఘాల నేతలను మూడోరోజు అనుమతి నిరాకరించడంతో నేతలు కౌన్సెలింగ్‌ను అడ్డుకుని కమిషనర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు ఖాళీలు ఎంచుకునేప్పుడు పొరపాట్లు జరగకుండా ఉండేందుకు నేతల అనుభవం కౌన్సెలింగ్ హాల్‌లో అవసరమని అందుకే తాము ప్రక్రియలో పాలుపంచుకుంటున్నామన్నారు. ప్రభుత్వ అక్రమాలకు అడ్డుగా ఉన్నందున, తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నందున తమ హక్కులను కాలరాసేందుకు, ఎన్నడూ లేని విధంగా అనుమతి నిరాకరించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు.
ఇదొక చీకటి కౌన్సెలింగ్
ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్‌ను సంఘాల నేతలు చీకటి కౌన్సెలింగ్‌గా పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు గంట ముందు మాత్రమే సినీయారిటీ జాబితాను తప్పుల తడకగా ప్రకటించి ఉపాధ్యాయులకు అవగాహన రాకుండానే మునుపెన్నడూ లేని విధంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శించారు. కమిషనర్ అడ్డగోలు విధానాలతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, తొలిరోజు పెద్దాపురం ఖాళీ అడిగితే జగ్గంపేటను బలవంతంగా కట్టబెట్టి, తరువాత వ్యక్తికి పెద్దాపురంలో ఖాళీ చూపించి ఇచ్చారని విమర్శించారు. తెలుగు భాషా పండితులకు సంబంధించి వేకెన్సీ జాబితాలో ఏజేన్సీ ఇందుకూరుపేటను సీఎస్‌ఈ వెబ్‌సైట్లో చూపించకపోవడం కారణంగా జాబితా తారుమారై ఉపాధ్యాయులు నష్టపోయారని డీఈఓకు ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు. ఈ పరిణామాలతో కౌన్సెలింగ్‌ను బహిష్కరించి ఉపాధ్యాయ నేతలు గంట సమయం పాటు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు వెళ్లకుండా నివారించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు పరచడంలో ఆటంకం కలిగించవద్దంటూ డీఈఓ ఉపాధ్యాయ సంఘాల నేతలను కోరడం, ఉపాధ్యాయులు సైతం కౌన్సెలింగ్‌ను అనుమతించాలని కోరడంతో సంఘాల నేతలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలోయూటీఎఫ్ నుంచి టి.కామేశ్వరరావు, బీవీ రాఘ«వులు, వర్మ, ఎస్‌టీయూ నుంచి పి.సుబ్బరాజు, కేవీ శేఖర్, పీఆర్‌టీయూ నుంచి చింతాడ ప్రదీప్‌కుమార్, పీఏవీవీ సత్యనారాయణ, ఆపస్ నుంచి నక్కా వెంకటేశ్వరరావు, జయరాజు, వ్యాయామోపాధ్యాయ సంఘం నుంచి లంక జార్జి, ఎస్‌వీ రంగారావు, వై.బంగార్రాజు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
389 మందికి కౌన్సెలింగ్
మూడోరోజు బదిలీ కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమై అర్థరాత్రి వరకు సాగింది. సోమవారం జరిగిన ఈ కౌన్సెలింగ్‌లో స్కూల్‌అసిస్టెంట్, లాంగ్వెజ్ పండిట్‌లకు సంబంధించి తెలుగు 185, హిందీ –194, ఉర్దూ–3, సంస్కృతం –6 ఖాళీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో డీఈఓ కార్యాలయం ప్రాంగణం బురదమయంగా మారి ఉపాధ్యాయులకు తలెత్తిన చిన్నపాటి ఇబ్బందులు మినహా కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది.
నేడు ఎస్‌ఏ ఇంగ్లీష్, గణితం కౌన్సెలింగ్
నేడు ఎస్‌ఏ గణితం 480 ఖాళీలకు గానూ 705 మందికి, ఎస్‌ఏ ఇంగ్లిష్ 390 ఖాళీలకు గానూ 549 మందికి,44 ఖాళీలకు సంబంధించి 20 మంది పీడీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. నేటి కౌన్సెలింగ్‌కు డీఈఓ కార్యాలయంతో పాటు పీఆర్‌జీ బాలుర ఉన్నత పాఠశాలలో వేరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కౌన్సెలింగ్‌ను డీఈఓ ఎస్.అబ్రహాం, ప్రత్యేకాధికారులు పర్యవేక్షించారు.