స్మార్ట్‌తోనైనా మురికి వదులుతుందా?
ఆ రెండు నగరాల్లోని దాదాపు 50 శాతం మంది ఇప్పటికీ మురికివాడల్లోనే ఉంటున్నారు. మూడురోజులకు ఒకసారిగానీ నీళ్లు రాని కాలనీలు అక్కడ ఉన్నాయి. ఆ నగరాల్లో మౌలిక సదుపాయాలు అంతంతే. అవే విశాఖపట్నం.. కాకినాడ. దేశవ్యాప్తంగా తొలి విడతలో ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్ సిటీస్)గా అభివృద్ధి చేయనున్న 20 నగరాల జాబితాలో రాష్ట్రం నుంచి ఈ రెండు నగరాలకు చోటు లభించింది.
స్మార్ట్ సిటీస్ పోటీలో ఇవి నెగ్గుకొచ్చినా.. వీటికున్న ‘మురికి’ వదిలి ‘స్మార్ట్’గా మారతాయా? అన్నది సందేహంగానే ఉంది. భారీఎత్తున మురికివాడలుండడంతో వేగంగా వసతులు కల్పించడం సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఈ రెండింటినీ స్మార్ట్‌గా మార్చాలంటే నిధుల వరద పారాల్సి ఉంటుందని, కానీ వీటిని సమకూర్చుకోవడం అనుకున్నంత సులువు కాదని వారభిప్రాయపడుతున్నారు.
- సాక్షి, హైదరాబాద్
సగం మందికిపైగా మురికివాడల్లోనే..
2011 జనాభా లెక్కల ప్రకారం.. విశాఖపట్నంలో 18.97 లక్షలమంది జనాభా ఉంటే అందులో 7.70 లక్షల మంది మురికివాడల్లోనే ఉన్నారు. కాకినాడదీ ఇదే పరిస్థితి. అక్కడ 3.84 లక్షల మంది జనాభా ఉంటే.. అందులో 1.12 లక్షలమంది మురికివాడల్లోనే ఉంటున్నారు. రెండు నగరాల్లోనూ అధునాతన సదుపాయాలు అంతంతే.
భారీగా నిధులు అవసరం..
ఈ నేపథ్యంలో రెండు నగరాల్ని ‘స్మార్ట్’గా మార్చాలంటే భారీఎత్తున నిధులు ఖర్చు చేయాల్సివుంది. స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక సేవలందించేందుకు 20 ఏళ్లలో ఒక్కొక్కరిపై రూ.43,386 చొప్పున ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ లెక్కన విశాఖలో 20 ఏళ్లలో రూ.8,230 కోట్లు అవసరం. అంటే ఏటా రూ.411 కోట్లు కావాలి. అలాగే కాకినాడకు 20 ఏళ్లల్లో రూ.1,666 కోట్లు కావాలి. అంటే ఏడాదికి రూ.84 కోట్లు అవసరమని మున్సిపల్ అధికారులు లెక్కలేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీలకిచ్చిన కొలమానాల ప్రకారం ఈ నిధుల్ని సమకూర్చుకోవడం, వాటిని వినియోగించి వసతులు కల్పించడం సాధ్యమేనా? అని వారు సందేహం వెలిబుచ్చుతున్నారు.
ప్రస్తుతం ప్రతిపాదనల దశకే రెండేళ్లు పట్టింది. మరో మూడేళ్లే మిగిలుంది. పైగా స్మార్ట్ సిటీలకు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్(వ్యత్యాస నిధి) మాత్రమే ఇస్తుందని, వీటి అభివృద్ధిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారానే చేసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో విశాఖ, కాకినాడల్లో ఒక్కొక్కరిపై 20 ఏళ్లలో రూ.50 వేలు చొప్పున ఖర్చుపెట్టినా స్మార్ట్ కొలమానాలు అధిగమించలేమేమోనన్న భావనను అధికారులే వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
ఎంతగా పన్నులేసినా సాధ్యమేనా?
మరోవైపు స్మార్ట్ హోదా దక్కించుకున్న నగరాల్లో పన్నుల తీరెలా ఉంటుందోనన్న ఆందోళనా మొదలైంది. పన్నులేయడం, రికవరీల్లో వేగం పెంచడం, కరెంటు చార్జీలు, ఆస్తిపన్ను, నీటిపన్ను, పారిశుద్ధ్య పన్ను వంటివన్నీ భారీగా పెంచే అవకాశాలుంటాయి. అయితే పన్నులేసినా సేవలెలా అందిస్తారన్నది అంచనా వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మురికివాడలు భారీగా ఉండటంతో స్మార్ట్ సిటీలో వేగంగా వసతులు కల్పించడం దుర్లభంగా కనిపిస్తోందంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడి వసతులు ఆధారపడి ఉంటాయని, రాష్ట్రాలనుంచి వచ్చే రికవరీలు, ఆదాయాలపై ఆశలు పెట్టుకుంటే ‘స్మార్ట్’గా మారే అవకాశం తక్కువని పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పడం విశేషం.
స్మార్ట్ సిటీకి కొన్ని ప్రధాన కొలమానాలివీ..
హెక్టారు పరిధిలో(ట్రాన్సిట్ కారిడార్‌లో) 175 మంది నివసించేలా ఉండాలి.
24 గంటలూ తాగునీటి సరఫరాతోపాటు 100% గృహాలకు నేరుగా తాగునీటి కనెక్షన్లు ఉండాలి.
వందశాతం ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలి.
వందశాతం కాలనీలకు రోడ్ల అనుసంధానం ఉండాలి.
100% ఇళ్లకూ విద్యుత్ కనెక్షన్లు ఉండాలి.
24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండాలి.
అన్ని ఇళ్లకూ టెలిఫోన్ కనెక్షన్‌తోపాటు మొబైల్ సదుపాయం ఉండాలి.
ప్రతి 15,000 మందికీ ఓ ఆస్పత్రి ఉండాలి.
ప్రతి లక్ష మందికీ 200 పడకలతో కూడిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, 500 పడకలతో కూడిన జనరల్ హాస్పిటల్ ఉండాలి.