కరీంనగర్‌లో పేట్రేగిన దొంగలు | snachers halchal in karimnager | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో పేట్రేగిన దొంగలు

Published Mon, Jul 25 2016 8:51 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న ఆరోగ్యశ్రీ పేషెంట్లు - Sakshi

ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న ఆరోగ్యశ్రీ పేషెంట్లు

  • ‘ఖని’ ఆస్పత్రిలో బయోమెట్రిక్‌ స్కానర్‌ చోరీ
  • గోప్యంగా ఉంచిన సర్కారు వైద్యులు
  • నిలిచిన ఆపరేషన్లు
  •  మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ 
  • వారం రోజులుగా ఇన్‌పేషెంట్ల ఇబ్బందులు
  • కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ విభాగంలోని బయోమెట్రిక్‌ థంబ్‌ ఇంప్రెషన్‌ స్కానర్‌(వేలి ముద్రల సేకరణ యంత్రం) చోరీ అయిన విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది, ఇన్‌పేషెంట్ల వేలిముద్రలు నమోదు చేసే ఈ స్కానర్‌ వారం క్రితం చోరీకి గురికాగా, ఆస్పత్రి సిబ్బంది, అధికారులు విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. ఫలితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇన్‌పేషెంట్లకు చేయాల్సిన ఆపరేషన్లు నిలిచిపోయాయి.  ఐదుగురు ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సూర్యశ్రీని వివరణ కోరగా యంత్రం చోరీ అయిన విషయం నిజమేనన్నారు. విచారణ కోసం ట్రస్ట్‌తోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయించమని తెలిపారు. పేషెంట్లు ఇబ్బంది పడకుండా మరో యంత్రం కొనుగోలు కోసం ట్రస్ట్‌కు లేఖ రాయడంతోపాటు రూ.3,150 చెక్కును పంపినట్లు వెల్లడించారు.
     మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ 
    మహాముత్తారం : మండల ప్రాథమిక సహకార పరపతి సంఘం బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. లోనికి చొరబడిన దొంగలు చైర్మన్‌ గది తలుపులు పగులగొట్టి క్యాషీయర్‌ రూంలోకి వెళ్లారు. లాకర్‌ను గడ్డ పార ఉపయోగించి పగులగొట్టడానికి విఫలయత్నం చేశారు. లాకర్‌  తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న కౌంటర్, బీరువాను ధ్వంసం చేసి అందులోని రూ.13 వేలు ఎత్తుకెళ్లారు. సోమవారం 10 గంటలకు బ్యాంక్‌కు వచ్చిన అటెండర్‌ బ్యాంకు తలుపులు ధ్వంసమై ఉండడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. బ్యాంక్‌ సిబ్బంది, కాటారం సీఐ సదన్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు, క్లూస్‌టీం సంఘటన స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బ్యాంక్‌సిబ్బంది చేతివేలి ముద్రలు సంఘటన జరిగిన పరిసరాలను, లాకర్, బీరువాపై ఉన్న వేలి ముద్రలు సేకరించారు. మంథని సబ్‌ డీఎల్పీవో జయప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
    శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల 
    సిరిసిల్ల టౌన్‌ : బంధువులు ఇంట్లో శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిన సంఘటన సిరిసిల్ల పట్టణంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయం వీధికి చెందిన మరిపల్లి విఠల్‌ రిటైర్డు బ్యాంకు ఉద్యోగి. కరీంనగర్‌లోని అతడి బంధువుల ఇంట్లో పూజ ఉండడంతో శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి అందరూ వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం తాళం తీసి ఉంది. చుట్టుపక్కల వారు దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే విఠల్‌కు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చారు. దేవుని గదిలోని బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు నెక్లెస్, మూడు వందల గ్రాముల వెండి సింహాసనం, రూ.7,500 దేవునికి ముడుపుల నగదు చోరీ అయినట్లు గుర్తించాడు.  రూ.1.20 లక్షల విలువైన వస్తువులు చోరీ అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విజయ్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. 
    అగ్రహారంలో చైన్‌స్నాచింగ్‌
    వేములవాడ రూరల్‌ : వేములవాడ మండలం అగ్రహారం వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. సిరిసిల్లకు చెందిన పద్మ, రాజు దంపతులు ద్విచక్రవాహనంపై వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. అగ్రహారం వద్దకు రాగానే మరో ద్విచక్రవాహనంపై వెనుకనుంచి వచ్చిన ఇద్దరు యువకులు పద్మ మెడలోని పుస్తెలతాడు లాక్కుని పారిపోయారు. బాధితులు వెంబడించినా దొరకలేదు. ఈ మేరకు బాధితులు వేములవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement