చెంచు గూడేలకు సోలార్ వెలుగులు
చెంచు గూడేలకు సోలార్ వెలుగులు
Published Sat, Jul 30 2016 12:35 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM
కర్నూలు(రాజ్‌విహార్): చెంచు గూడేలకు సోలార్ ద్వారా విద్యుత్ వెలుగులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ కె. విజయానంద్ తెలిపారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక విద్యుత్ భవన్‌లో, దిన్నెదేవరపాడు రోడ్డులోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటడంతో పాటు ఉద్యోగులందరితోనూ ఆయన నాటించారు. అనంతరం సిబ్బంది, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచు గూడెలకు చెట్లు అడ్డు ఉన్న కారణంగా ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం ఇవ్వలేదని, దీనికి అటవీ శాఖ అనుమతులూ పొందాల్సి ఉందన్నారు. దీంతో స్థానికంగా సోలార్ సిస్టంను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పారు. విద్యుత్ సబ్‌స్టేషన్లను హరిత వనంలా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, వనం–మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి సబ్‌స్టేషన్‌ను హరిత వనంలా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈఓ ఎ. చంద్రశేఖర్ రెడ్డి, ట్రాన్స్‌కో కడప జోన్ సీఈ శ్రీరాములు, ఎస్‌ఈ చంద్రశేఖర్, ఎస్‌పీడీసీఎల్ కర్నూలు జోన్ సీఈ పీరయ్య, ఆపరేషన్స్ ఎస్‌ఈ భార్గవ రాముడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement