గొడుగు తిరగబడితే..
వానొస్తే.. గొడుగు చేత పట్టుకుంటాం. మరి ఇదే గొడుగును వాన నీటిని ఒడిసిపట్టేందుకు వాడితే? ఐడియా అదుర్స్ కదూ..! ముంబైలోని ప్రియా, సమిత్ చోక్సీ దంపతులు అదే పనిచేశారు. అంతేకాదు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు గొడుగు లాంటి నిర్మాణంతో అటు వాన నీటిని ఒడిసి పట్టడంతో పాటు ఇటు విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తున్నారు. ఫొటోలో చూశారు కదా తిరగేసిన గొడుగు మాదిరి ఉన్న ఈ నిర్మాణాన్ని ప్రియా, సమిత్ చోక్సీ దంపతులు రూపొందించారు. వర్షం వచ్చినపుడు ఇందులో నీరు నిలుస్తాయి. మూడడుగుల పైపు భాగంలో గొడుగు వంటి నిర్మాణం ఉంటుంది. ఈ పైపు అటూఇటూ కదలకుండా ఒక చదరపు అడుగు కాంక్రీట్ దిమ్మపై దీన్ని అమర్చారు. పైపు చుట్టూ కొన్ని తీగలు ఏర్పాటు చేశారు. గొడుగు లోపలివైపు ఏర్పాటు చేసిన పలుచటి ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్ సౌరశక్తిని విద్యుత్తుగా మార్చి బ్యాటరీకి చేరవేస్తాయి. వానొస్తే గొడుగు లోపలి భాగంలోకి చేరే నీరు పైపు గుండా కిందకు వెళ్తాయి.
ఎక్కడెక్కడ వాడుకోవచ్చు...
ఉల్టా ఛత్రీలను ఇంకుడు గుంతలకు ప్రత్యామ్నాయంగా ఇంటికప్పులపై ఏర్పాటు చేసుకోవచ్చు. చతురస్రపు, వృత్తాకారపు ఆకారాల్లో లభిస్తున్న వీటి వైశాల్యం 16 చదరపు మీటర్ల నుంచి 36 చదరపు మీటర్ల వరకూ ఉంటుంది. సైజును, పడే వర్షం ఆధారంగా ఒక్కో ఉల్టా ఛతా నుంచి ఏడాదికి లక్ష లీటర్ల నీటిని సేకరించవచ్చు. ఒక్కోదాన్ని గంట సమయంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, ఫ్యాక్టరీల్లో ఉల్టా ఛత్రీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్తు ఖర్చును తగ్గించుకోవడంతోపాటు శుభ్రమైన నీటిని కూడా పొందవచ్చని సమిత్ పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
- సాక్షి, హైదరాబాద్
ఎన్నో ప్రత్యేకతలు...
‘ఉల్టా ఛత్రీ’ అని పిలుస్తున్న ఈ నిర్మాణంతో వాన నీటిని పట్టుకోవడమే కాదు ఆ నీటిని శుద్ధి చేస్తుంది కూడా. ఇందుకోసం గొడుగు పైభాగంలో వల లాంటి నిర్మాణం ఉంటుంది. పైపు పైభాగంలో 20 మైక్రాన్ల సైజున్న మలినాలనూ తొలగించేందుకు మరో ఫిల్టర్ ఏర్పాటు చేశారు. అవసరమైతే అతినీలలోహిత కిరణాలతో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను నాశనం చేసే వ్యవస్థను కూడా బిగించుకోవచ్చు. లోపలి భాగంలో దాదాపు 1.5 కిలోవాట్ల సామర్థ్యమున్న ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం 100 వాట్ల మాడ్యూల్స్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని సమిత్ చోక్సీ ‘సాక్షి’కి తెలిపా రు. ఈ విద్యుత్తుతో పదివాట్ల ఎల్‌ఈడీ బల్బులను రోజుకు 12 గంటల చొప్పున ఐదు రోజుల పాటు వెలిగించవచ్చన్నారు.