వైవీయూలో ఘనంగా వనం–మనం
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘వనం–మనం’ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం ఆవరణంలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా భారీ ర్యాలీగా తరలివచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్టెప్ సీఈఓ మమత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి సంరక్షించాలని సూచించారు. భూతాపాన్ని తగ్గించడంలోను, మంచి పర్యావరణం ఏర్పాటు చేయడంలో చెట్లు ఎంతో కీలకమన్నారు.
విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యత భావించి, భావితరాలకు మంచి పర్యావరణం అందించడానికి మొక్కలు నాటడమే సరైన మార్గమన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రకృతి పరిరక్షణా సమితి అధ్యక్షులు సిద్ధప్ప మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కనీసం మూడు సంవత్సరాల వరకు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాంతారీఖ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య టి. రాంప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, హరినాథ్, వెంకటేశ్వర్లు, విజయభారతి తదితరులు పాల్గొన్నారు.