Vanam Manam
-
‘మొక్క’వోని సంకల్పం
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ప్రతి రైతు కనీసం 10 మొక్కలు నాటేలా చర్యలు చేపట్టబోతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ–వెలుగు) ద్వారా నడుపుతున్న రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఈ మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో డీఆర్డీఏ–వెలుగు ద్వారా 2,813 రైతు ఉత్పత్తి సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 32,117 మంది రైతులు సభ్యులుగా చేరారు. ఈ రైతు ఉత్పత్తి సంఘాలు దోర్నాల, దొనకొండ, టంగుటూరు, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, బల్లికురవ, గుడ్లూరు, వెలిగండ్ల, కనిగిరి, వలేటివారిపాలెం, నాగులుప్పలపాడు, కొనకనమిట్ల, దొనకొండ, కనిగిరి, మద్దిపాడు, హనుమంతునిపాడు, జరుగుమల్లి మండలాల్లో ఉన్నాయి. వీరికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజర్స్ (ఎఫ్‌పీవో) ద్వారా రైతులకు అనేక సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రతి రైతు కనీసం 10 మొక్కలను తమ ఆధీనంలో అంటే పొలాల గట్లపై గానీ ఇంటి వద్ద గానీ నాటేలా చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 3 లక్షల మొక్కలను రైతుల ద్వారా నాటించాలన్నదే లక్ష్యం. రైతులకు సరఫరా చేసే మొక్కలను జిల్లాలో ఉన్న ఫారెస్ట్ నర్సరీల నుంచి సరఫరా చేయనున్నారు. ఈ రైతు ఉత్పత్తి సంఘాలు ఉన్న ప్రాంతాలకు నర్సరీల నుంచి మొక్కలను సరఫరా చేస్తారని, అక్కడ నుంచి రైతులకు ఇస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వనం–మనం, ప్రకృతి పిలుస్తోంది అనే పేరుతో క్యాంపెయిన్ చేపట్టబోతుంది. రైతులే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సంఘ మహిళా సభ్యులకు కూడా మొక్కలను సరఫరా చేస్తారు. ఈ కార్యక్రమం అమలుపై రైతు ఉత్పత్తి సంఘాలు మంగళవారం సమావేశం కానున్నాయి. అదే విధంగా డీఆర్డీఏ–వెలుగు, అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలోని సీపీవో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించాలని సర్కార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతే కాకుండా ప్రతి సిటిజనర్ ఒక మొక్క నాటేలా ప్రోత్సహించాలని సూచించింది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వనం–మనం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. -
‘ఆది’ ప్రసంగానికి స్పందన నిల్
వైవీయూ : వైఎస్ఆర్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన రాజకీయ ప్రసంగాన్ని విద్యార్థులు పట్టించుకోలేదు. పొంతనలేని మాటలతో ప్రారంభించిన ఆయన ఉపన్యాసంలో ఎప్పటిలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేసేందుకు యత్నించగా.. అదే సమయంలో వెనుకవైపు ఉన్న యువత జైజగన్.. అంటూ ఆయనకు తిరుగు సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైవీయూకు రూ. 100కోట్లకు పైగా నిధులు కేటాయించగా.. పస్తుతం ప్రభుత్వం రూ. 40 కోట్లను ఇచ్చారని.. ఇది వైఎస్ హయాం కంటే ఎక్కువ ఎక్కువ నిధులు ఇచ్చారని పేర్కొనడం గమనార్హం. చివరగా ప్రతి ఒక్కరూ 10 మొక్కలు కాదు 100 మొక్కలు నాటాలని.. అదే స్ఫూర్తితో మా ప్రభుత్వానికి రాజకీయాల్లో అండగా నిలవాలని కోరారు. అండగా నిలుస్తామనేవారు చేతులెత్తి మద్ధతు ప్రకటించాలని కోరారు. ఈయన పిలుపుకు విద్యార్థులెవరూ చేతులెత్తకపోవడంతో మరోసారి చేతులెత్తాలని కోరినా విద్యార్థులెవరూ పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఉపన్యాసం ముగించారు. సభలో సీఎం డౌన్‌డౌన్ నినాదాలు.. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో తమ గొం తును వినిపించేందుకు వచ్చిన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో తామేమైనా అసాంఘిక శక్తులమా అంటూ వారితో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని హరించేలా ఏపీఆర్‌సెట్, స్క్రీనింగ్టెస్ట్లు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని దీని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. దీనికి ససేమిరా పోలీసులు ససేమిరా అనడంతో విద్యార్థి సంఘాల నాయకులు సీఎం గోబ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి నాయకుల నోరు మూసి, మెడలు విరుస్తూ ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనసేన విద్యార్థి విభాగం నాయకులు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగించే సమయంలోతిరుగుముఖం పట్టిన విద్యార్థులు.. ఉదయం 7 గంటల నుంచి ముఖ్యమంత్రి కోసం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వేచి ఉన్నారు. దాదాపు 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కావడంతో అప్పటికే విసిగిపోయిన విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. వీరిని ఆపేందుకు పోలీసులు కూర్చోవాలని కోరినా పట్టించుకోకుండా వెనుతిరిగారు. -
‘వనం–మనం’ అపహాస్యం !
కృష్ణాజిల్లా ,నూజివీడు: ఇళ్లల్లో చెట్లు పెంచడం కాదు... చెట్లలో ఇళ్లు కట్టుకోవాలి... 2029నాటికి రాష్ట్రంలో మొత్తం భూభాగంలో 50శాతం పచ్చదనం ఉండాలి.. మొక్కలు నాటే కార్యక్రమం 127రోజులు కొనసాగుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు వనం–మనం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చెప్పిన మాటలివి... కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వనం–మనం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వనం–మనం కార్యక్రమం ప్రారంభించిన నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వనం–మనం ప్రారంభించిన చోటే మొక్కల పెంపకం ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఎలా అమలవుతోందో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతనెల 14వ తేదీన వనం–మనం కార్యక్రమాన్ని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీనికి గాను అటవీశాఖ అధికారులు ట్రిపుల్ఐటీకి చెందిన 10ఎకరాల స్థలాన్ని మొక్కలు నాటడానికి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రితో మొక్కలు నాటించిన తరువాత అదే ప్రాంతంలో రావి, వేప, టేకు తదితర వేలాది మొక్కలు నాటారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యే వరకు హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత నాటిన మొక్కల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ మొక్కలకు నీళ్లు పోసే నాధుడు కూడా లేకపోవడంతో నాటిన మొక్కలు చనిపోతున్నాయి. నాటిన వేలాది మొక్కల్లో ఇప్పటికే వందలాది వేప మొక్కలన్నీ చనిపోయి ఎండిపోతుండగా, రావిమొక్కలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. -
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని జేసీ–2 ఆర్.సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న చర్చావేదికలో భాగంగా ఆదివారం వనం – మనం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడడం భావితరాలకు సంపదను ఇవ్వడమేనని తెలిపారు. స్వచ్ఛంద సేవాసంస్థల అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు మాట్లాడుతూ విచ్చలవిడిగా చెట్లను నరికివేయడంవల్ల కాలుష్యం అధికమవుతుందన్నారు. కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యానాదిసంఘం అధ్యక్షురాలు మల్లికా శైలజ మాట్లాడుతూ ప్రకృతి స్వచ్ఛతకు చిహ్నమన్నారు. ప్రకృతి ఫలాలను అనుభవించాలేగానీ ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించకూడదని తెలిపారు. డీఎఫ్ఓ ఎం.చాణిక్యరాజు మాట్లాడుతూ జిల్లాలో కోటికిపైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వెంకటగిరి డీఎఫ్ఓ రవీంద్రరెడ్డి, తెలుగుగంగ డీఎఫ్ఓ హుస్సేనీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు
స్కైప్ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్) : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె. సూరిబాబు ఆధ్వర్యంలో డీఎస్పీలు మొక్కలు నాటారు. ఎస్పీ కృష్ణా పుష్కరాల విధుల్లో ఉండటంతో మాస్‌ప్లాంటేషన్ కార్యక్రమాన్ని స్కైప్ వీడియో కాలింగ్ ద్వారా సమీక్షించారు. ఆయన స్కైప్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్‌లో భూగ్రహం మీద జీవులు మనుగడ సాధించాలంటే ఇప్పటినుంచే మొక్కలు విరివిగా నాటాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్, పోలీస్‌గ్రౌండ్స్, క్వార్టర్స్, దత్తత గ్రామాలు, విద్యాలయాల్లో రెండు రోజుల్లోపు 5 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏఎస్పీ బి. శరత్‌బాబు మాట్లాడుతూ మానవుడు ప్రకృతి వనరులు అవసరానికి మించి వాడడం ద్వారా వివిధ రకాల కాలుష్యాలను సృష్టించి పుడమి తల్లికి అపార నష్టం కల్గిస్తున్నాడన్నారు. డీఎస్పీలు కోటారెడ్డి, జీవీ రాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, బాలసుందరం, మోహన్‌రావు, శ్రీనివాసరావు, చెంచురెడ్డి, ఆర్ఐలు కేజేఎం చిరంజీవి, శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మాణిక్యరావు, ఎస్ఐ బి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నెల్లూరు(బారకాసు): మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అటవీశాఖలోని సామాజిక వన విభాగం, టెరిటోరియల్ సంయుక్తంగా నిర్వహించిన 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం వీఆర్సీ మైదానంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఒక్కొక్కరు ఏడాదికి ఆరు మొక్కలు చొప్పున నాటాలన్నారు. జిల్లాలో మొదట విడతగా ఐదు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి 20 వేల మొక్కలను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మొక్కలు నాటడంతో సరిపోదని వాటిని కనీసం రెండేళ్లపాటు సంరక్షించినప్పుడే దాని ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఈసందర్భంగా అటవీశాఖాధికారులు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి నారాయణ బహుమతులు ప్రదానం చేశారు. అలాగే మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామంటూ మంత్రి నారాయణ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందుగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మైదానం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో మంత్రి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ అబ్దుల్అజీజ్, టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, చాట్ల నరసింహరావు, అనురాధ, రంగమయూర్‌రెడ్డి, అన్చూరు వాణి, జ్యోత్సS్నలత, జేసీ ఇంతియాజ్, డీఎఫ్ఓ చాణక్యరాజు పాల్గొన్నారు. -
వైవీయూలో ఘనంగా వనం–మనం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘వనం–మనం’ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం ఆవరణంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా భారీ ర్యాలీగా తరలివచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్టెప్ సీఈఓ మమత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి సంరక్షించాలని సూచించారు. భూతాపాన్ని తగ్గించడంలోను, మంచి పర్యావరణం ఏర్పాటు చేయడంలో చెట్లు ఎంతో కీలకమన్నారు. విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యత భావించి, భావితరాలకు మంచి పర్యావరణం అందించడానికి మొక్కలు నాటడమే సరైన మార్గమన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రకృతి పరిరక్షణా సమితి అధ్యక్షులు సిద్ధప్ప మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కనీసం మూడు సంవత్సరాల వరకు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాంతారీఖ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య టి. రాంప్రసాద్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, హరినాథ్, వెంకటేశ్వర్లు, విజయభారతి తదితరులు పాల్గొన్నారు. -
‘వనం–మనం’లో అపశ్రుతి
మెుక్కలు నాటుతుండగా నర్సుకు పాము కాటు ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. చెట్లు నాటుతున్న నర్సు పాము కాటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన మండలంలోని ఈతముక్కలలో జరిగింది. ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటేందుకు అక్కడి వైద్యాధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు. స్టాఫ్ నరుస్సు సీహెచ్ ప్రమీల మొక్కలు నాటేందుకు పాదులు తీస్తుండగా గుమ్మడిత్తుల పాము చేతిపై కాటేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి 48 గంటలు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీలను ఆమె పరామర్శించారు. -
నేడు కృష్ణ జిల్లాలో వనం - మనం
-
పుష్కర పనులపై సీఎం అసంతృప్తి
విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆగష్టు లో జరిగే కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై చర్చ జరిగింది. రూ. 80 కోట్ల విలువైన పుష్కర పనులకు మంత్రి వర్గం ఆమోదించింది. కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కమీషన్ క్వింటాకు రూ.70 పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఆగస్టు నెలలో ప్రభుత్వం ప్రారంభించనున్న వనం - మనం కార్యక్రమం, కృష్ణా పుష్కరాలతోపాటు పాలనలో సాంకేతిక అనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో కృష్ణా పుష్కరాల్లో టెండర్లు లేకుండా కేటాయించిన పనులకు కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అనంతరం వివిధ శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అయితే అనుమతులు లేకుండా ఇరిగేషన్ శాఖలో దాదాపు రూ. 86 కోట్ల విలువైన పనుల బిల్లుల చెల్లింపునకు ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. కాగా ఈ బిల్లుల చెల్లింపుపై కేబినేట్ ఆమోదం తెలపనుందని తెలిసింది.