అదనపు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
Published Fri, Sep 23 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
తాడేపల్లిగూడెం: జిల్లా ప్రధాన కేంద్ర ఆస్పత్రుల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు అదనంగా 13 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసు తెలిపారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఇటీవల 1,400 మంది వైద్యులను నియమిం చామని చెప్పారు. క్షేత్రస్థాయి పారామెడికల్ సిబ్బందికి ట్యాబ్‌లు అందించి గర్భిణుల వివరాలు తెలుసుకోవడంతోపాటు కావాల్సిన వైద్య సాయం అందిస్తున్నామన్నారు.
ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్
35 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రొమ్ము, గర్భాశయ కేన్సర్, కీళ్ల నొప్పులు, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించి మాస్టర్ హెల్త్ చెకప్ పేరిట ఉచిత వైద్య పరీక్షలు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 13 వేల ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు ఎన్టీఆర్ కిట్ పేరుతో దోమల తెర, శానిటేషన్ టవల్, సబ్బు తదితర వస్తువులు అందిస్తున్నామని చెప్పారు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2,000 జనరిక్ మం దుల దుకాణాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక ట్రా మా కేర్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి కామినేనిని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గట్టిం మాణిక్యాలరావు, డీసీహెచ్‌ఎస్ కె.శంకరరావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement