in tpg
-
పాఠశాలలను సిద్ధం చేయాలి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): పాఠశాలల పునఃప్రారంభం కల్లా పాఠశాలలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవాని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మాంటిస్సోరీ పాఠశాలలో డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. హెచ్ఎంలను ఉద్దేశించి డీఈఓ మాట్లాడుతూ పదో తరగతిలో ఫైయిలైన విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్స్ ఉపాధ్యాయులతో రోజూ 2 గంటల సేపు ప్రత్యేక బోధన చేయించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదుల పరిశుభ్రత, టాయ్‌లెట్స్ సక్రమ నిర్వహణ, తాగునీరు, కిచెన్ గార్డెన్ బాధ్యతను హెచ్ఎంలు తీసుకోవాలని సూచించారు. డిజిటల్ తరగతులను రోజుకు 4 గంటలకు తగ్గకుండా నిర్వహించాలన్నారు. డిజిటల్ గదులు లేని పాఠశాలల ప్రదానోపాధ్యాయులు గ్రామాలలోని దాతల సహకారంతో రూ.45 వేలు విరాళంగా సేకరిస్తే ముగిలిన సొమ్మును ప్రభుత్వ నిధులలో కేటాయించి డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేస్తామన్నారు. కాల నిర్ణయ పట్టికలో సబ్జెక్టు బోధనలతో పాటుగా నీటి విద్య, వ్యాయా విద్య, జీవన నైపుణ్యాలు, ఒకేషనల్ విద్యకు స్థానం కల్పించాలని డీఈఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓలు హనుమ, శేషు, శ్రీనివాస్, వంగపండు నరసింహమూర్తి, పాపారావు, విలియమ్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పింఛన్లకు రూ.805 కోట్లు
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్రంలో దివ్యాంగులకు ఏటా రూ.805 కోట్లతో పింఛన్లు అందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం స్థానిక సుబ్బారావుపేట ఎలిమెంటరీ మునిసిపల్ పాఠశాలలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రూ.72 కోట్లు ఏటా పింఛన్లుగా అందిస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ. 50 వేలు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్టు చెప్పారు. మునిసిపల్ పాఠశాలలో ప్రత్యేక గది, ప్రత్యేక మరుగుదొడ్డి ఏర్పాటుకు తల్లిద్రండులు కోరగా మంత్రి స్పందించి వెంటనే ప్రత్యేక గదులు, మరుగుదొడ్డి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం పొందిన పిల్లలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఎస్ఎస్ఏ పీవో బ్రహ్మానందరెడ్డి, దత్త విశ్వరూప సమితి అధ్యక్షుడు వలవల సూరిబాబు మాట్లాడారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఎంపీపీ గన్నమని దొరబాబు, ఎంపీడీవో వై.దోసిరెడ్డి, మండల యువమోర్చా అధ్యక్షుడు వన్నెంరెడ్డి నవీన్‌కుమార్ పాల్గొన్నారు. -
ఉల్లి మార్కెట్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
తాడేపల్లిగూడెం రూరల్ : పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల గోదాములు, విక్రయ కేంద్రాల్లో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఉల్లి విక్రయాలు, కాటా, నిల్వల గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, పాత నోట్లు కూడా తీసుకుంటున్నట్టు వ్యాపారులు జేసీకి చెప్పారు. అనంతరం జేసీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉల్లి కొరత ఉంటే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని, వ్యాపారులు సహకరించాలని కోరారు. జిల్లాలో ఉల్లిపాయలు, నిత్యావసర సరుకులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వ్యాపారులు తీసుకురావద్దని సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ డి.శివశంకర్‌రెడ్డి, తహíసీల్దార్ పాశం నాగమణి, సీఎస్‌డీటీ రమణ ఉన్నారు. -
సత్తా చాటిన ఫుట్‌బాల్ జట్లు
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన పుట్‌బాల్ పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో జి.పంగిడిగూడెం ఫుట్‌బాల్ క్లబ్ జట్టు, సీనియర్ మెన్స్ విభాగంలో ఏలూరు, దేవరపల్లి జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. అండర్ –16 బాలుర రన్నరప్‌గా దేవరపల్లి పుట్‌బాల్ క్లబ్ నిలిచింది. విజేతలకు పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ మూర్తి బహుమతులను అందజేశారు. పోటీలకు రిఫరీగా ఎన్.ఓం ఫణి వ్యవహరించారు. ఈ పోటీల ద్వారా జిల్లాలో ప్రతిభ కలిగిన వంద మంది క్రీడాకారులను ఎంపికచేసినట్టు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు తెలిపారు. జ్యోతి నర్సింగ్ స్కూల్ నిర్వాహకుడు దత్తు వెంకటేశ్వరరావు, ప్లో సీఈవో రాజేష్ రావూరి పాల్గొన్నారు . -
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు గురువారం స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణ మూర్తి జెడ్పీ హైస్కూల్లో ప్రారంభమయ్యాయి. బాలుర జట్టులో సెమీ ఫైనల్స్‌కు పల్లంట్ల, పంగిడిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి జట్లు చేరుకున్నాయి. బాలికల జట్టులో సెమీ ఫైనల్స్‌కు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, చిట్యాల, పల్లంట్ల జట్లు చేరాయి. శుక్ర,శని వారాలు సీనియర్ విభాగంలో పోటీలు జరగనున్నాయి. -
అదనపు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
తాడేపల్లిగూడెం: జిల్లా ప్రధాన కేంద్ర ఆస్పత్రుల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు అదనంగా 13 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసు తెలిపారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఇటీవల 1,400 మంది వైద్యులను నియమిం చామని చెప్పారు. క్షేత్రస్థాయి పారామెడికల్ సిబ్బందికి ట్యాబ్‌లు అందించి గర్భిణుల వివరాలు తెలుసుకోవడంతోపాటు కావాల్సిన వైద్య సాయం అందిస్తున్నామన్నారు. ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రొమ్ము, గర్భాశయ కేన్సర్, కీళ్ల నొప్పులు, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించి మాస్టర్ హెల్త్ చెకప్ పేరిట ఉచిత వైద్య పరీక్షలు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 13 వేల ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు ఎన్టీఆర్ కిట్ పేరుతో దోమల తెర, శానిటేషన్ టవల్, సబ్బు తదితర వస్తువులు అందిస్తున్నామని చెప్పారు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2,000 జనరిక్ మం దుల దుకాణాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక ట్రా మా కేర్ సెంటర్ ఏర్పాటుచేయాలని మంత్రి కామినేనిని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గట్టిం మాణిక్యాలరావు, డీసీహెచ్ఎస్ కె.శంకరరావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మూడు ట్రెక్కింగ్ కార్యక్రమాలు
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : యువత కోసం మూడు ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కారుమూరి సూర్యనారాయణ వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రథమ్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతలో సహస క్రీడలు, పర్యాటక ప్రదేశాల సందర్శనపై ఆసక్తి కలిగించేందుకు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. 2016–17లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. చిత్తూరు జిల్లా యుద్ధగళ తీర్ధం ట్రెక్కింగ్ కార్యక్రమం డిసెంబర్ 8న ప్రారంభమై 5 రోజులు కొనసాగుతుందని, అరకులోయ ట్రెక్కింగ్ డిసెంబర్ 23న ప్రారంభమై 6 రోజులు, చిత్తూరు జిల్లా శేషాచలం ట్రెక్కింగ్ 2017 జనవరి 25 నుంచి ప్రారంభమై 4 రోజులు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు 99852 04518 ఫోన్ నంబర్లో సంప్రదించాలని, వైహెచ్‌ఏఐడాట్‌ఓఆర్‌జి వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. తాడేపల్లిగూడెంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ శాఖను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. -
తాడేపల్లిగూడేనికి రింగ్ రోడ్డు
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటుగా పాత ఓవర్‌బ్రిడ్జి నుంచి రైల్వేస్టేషన్ వరకు మార్గం సుగమం చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గురువారం తెలిపారు. పట్టణంలో రూ.19 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. హౌసింగ్ బోర్డు గణేష్‌నగర్ బాపూజీ పుంతరోడ్డు, కుంచనపల్లి రోడ్డు మీదుగా జువ్వలపాలెం ఫుట్ బ్రిడ్జి వద్ద రహదారి వంతెన నిర్మించి ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తామన్నారు. కొత్త ఫ్లై ఓవర్‌పై వన్‌వే ట్రాఫిక్ అమలు చేస్తామని చెప్పారు. ఈ వంతెన జంక్షన్ నుంచి కొండయ్య చెరువు వరకు రూ.75 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తామన్నారు. హైవేకు ఇరువైపులా సమాంతర రహదారులు ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాదంపూడి జంక్షన్ నుంచి ప్రత్తిపాడు ‘సాక్షి’ జంక్షన్ వరకు 16వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా సమాంతర రహదారులు నిర్మిస్తామన్నారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి ఈ ప్రతిపాదనలకు అంగీకరించారని మంత్రి చెప్పారు. మునిసిపల్ ఇంజినీర్ బ్రహ్మాజీ, ఆర్అండ్బీ డీఈ ఏడుకొండలు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు ఆయన వెంట ఉన్నారు. -
త్వరలో నిట్ భవనాలు పూర్తి
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌కు సంబంధించి శాశ్వత భవనాలను త్వరలో పూర్తిచేసేందుకు కషిచేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. నిట్ తాత్కాలిక క్యాంపస్, శాశ్వతభవనాల నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. ముందుగా భవన నిర్మాణానికి సంబంధించి నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ టి.రమేష్, అధికారులతో చర్చించారు. తాత్కాలిక తరగతుల నిర్వహణ, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల గురించి మాట్లాడారు. భవనాల నిర్మాణాలకు అవసరమయ్యే నిధులు, మాస్టర్ ప్లాను రూపకల్పన, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక పరిశీలించారు. హాస్టల్ భవనాల నిర్మాణానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కోరారు. వచ్చే జూన్ నాటికి హాస్టల్ భవనాలను పూర్తిచేయాలని సూచించారు. నిధుల విడుదలలో జాప్యం ఉండదని, దానికి అనుగుణంగా వెంటనే టెండరు ప్రక్రియలను ప్రారంభించాలని సూచించారు. శశి ఇంజినీరింగ్ కళాశాలకు దగ్గరలో నిట్ హాస్టల్ భవనాలు నిర్మించే ప్రతిపాదిత స్థలం పరిశీలించారు. భూమి స్థితిగతులు, నీటి లభ్యత తదితరాలపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. నిట్ మెంటర్ డైరెక్టర్ డాక్టర్ చలం, రెసిడెంట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ టి.రమేష్, ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ కె.మధుమూర్తి , సీపీడబ్ల్యూడీ అధికారి సీఎన్ సురేష్, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గ కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బ్రహ్మయ్య, పరిపాలనాధికారి నారాయణరావు ఆయన వెంట ఉన్నారు.