మందలించాడని తండ్రిపై హత్యాయత్నం
మందలించాడని తండ్రిపై హత్యాయత్నం
Published Thu, Jan 19 2017 11:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
కొత్తపల్లి (పిఠాపురం) : కుటుంబం రోడ్డున పడుతుందని, జాగ్రత్త ఉండాలని హితబోధ చేసిన తండ్రిపైనే ఆ కొడుకు కక్ష పెంచుకుని కత్తితో దాడి చేసిన సంఘటన కొత్తపల్లి మండలం కొండెవరం శివారు కాశివారి పాకల్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాశివారం పాకలుకు చెందిన వాసంశెట్టి గురువుల దంపతుల 9మంది సంతానంలో మూడో కుమారుడు వాసంశెట్టి లోవరాజు కొబ్బరికాయలు అమ్ముతూ జీవిస్తుంటాడు. మద్యానికి బానిసై చేసిన అప్పులు తీర్చడంలేదు. కాగా బుధవారం రాత్రి తన సోదరునితో గేదెలకు రక్షణగా వేసే దోమతెర విషయంలో ఘర్షణ పడ్డాడు. దీంతో తండ్రి గురువులు లోవరాజును మందలించాడు. దీంతో కక్ష పెట్టుకుని గురువారం మద్యం మత్తులో గురువులపై కొబ్బరికాయలు నరికే కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన గురువులను స్థానికులు చికిత్సకోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొత్తపల్లి ఎస్సై చైతన్యకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరారైన లోవరాజుపై హత్యాయత్నం కేసును నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement