
సోనియా, రాహుల్ ప్రచారం లేనట్టే
వరంగల్‌లో ఖర్గే, మీరాకుమార్, పైలట్‌లతో ప్రచారం...
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రావడం లేదు. లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలట్, ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు వరంగల్ ప్రచారానికి రానున్నారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాహుల్ రాష్ర్ట పర్యటనను ఖరారు చేసేందుకు టీపీసీసీ యత్నించింది. ఆగస్టులో రాహుల్ పర్యటనకు తేదీలు ఖరారు చేశాక రెండుసార్లు వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయన పర్యటన ఉంటే పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని టీపీసీసీ భావించింది.
నోటిఫికేషన్ వచ్చిన తరువాత సోనియాను ప్రచారానికి ఆహ్వానించాలని ముందుగా అనుకున్నారు. అయితే, టీపీసీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక ఉప ఎన్నికకు ఎక్కువ ప్రచారం కల్పించడం వల్ల పార్టీకి భవిష్యత్తులో నష్టం కలుగుతుందని పలువురు సీనియర్లు హెచ్చరించారు. ఉప ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయని, ప్రచారం కోసం పార్టీ అధినేత్రిని పిలవడం మంచిది కాదని వారు సూచించారు.
సోనియా, రాహుల్ ప్రచారం తరువాత కూడా పార్టీ అభ్యర్థి ఓడిపోతే నేతలు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే హెచ్చరికల నేపథ్యంలోనే వారిని ఆహ్వానించాలనే యోచనను విరమించుకున్నట్టు తెలిసింది. వరంగల్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి దానికి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్‌ను ఆహ్వానించాలని టీపీసీసీ నిర్ణయించింది. మల్లికార్జున ఖర్గే, యువతలో కొంత ఇమేజీ ఉన్న సచిన్ పైలట్ వంటివారితోనూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. వీరితో పాటు తెలంగాణ బిల్లు ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించిన జాతీయ నేతలను, సినీ తారల కోసం కూడా టీపీసీసీ ప్రయత్నాలు చేస్తోంది.