కన్నీటి పంట
కన్నీటి పంట
Published Sat, Oct 1 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
– పడిపోయిన ఉల్లి ధర
– ఖర్చులూ దక్కకపోవడంతో పొలం గట్లపై పోస్తున్న రైతులు
– వెంకటగిరిలో గొర్రెలకు వదలిన వైనం
ఎమ్మిగనూరురూరల్: ఉల్లి పంట వినియోగదారులకు బదులు రైతుకే కన్నీరు తెప్పిస్తోంది. ధర పూర్తిగా పడిపోయి ఖర్చులు కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు పొలం గట్లకు పోసి రబీలో ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామంలో గొల్ల రంగన్న అనే రైతు తన రెండెకరాల ఉల్లి పంటను గొర్రెలకు మేపుతున్నాడు. పెట్టుబడి కింద ఖర్చు చేసిన లక్షరూపాయలు మట్టిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మండల పరిధిలో 1155 హెక్టార్లలో ఉల్లి సాగైంది. ప్రధానంగా ఎర్రకోట, గుడేకల్, పార్లపల్లి, కలుగోట్ల, కడిమెట్ల, మల్కాపురం, బనవాసి, దైవందిన్నె, చెన్నాపురం, సిరాలదొడ్డి, గువ్వలదొడ్డి గ్రామాల రైతులు సాగుచేశారు. దిగుబడులు చేతికొచ్చిన తర్వాత క్వింటా కనీస ధర రూ. 150 పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు బాడుగలు కూడా రావడం లేదని పేర్కొంటున్నారు. దీంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొందరు కోతలు కూడా లేకుండానే వదిలిపెడుతున్నారు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తడిసిమోపెడవడంతో వాటిని ఎలా చెల్లించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
Advertisement