ఒక్క క్షణం ఆలోచించు | sp statement of suicide cases | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణం ఆలోచించు

Published Sat, Jul 29 2017 10:07 PM | Last Updated on Tue, Nov 6 2018 8:41 PM

ఒక్క క్షణం ఆలోచించు - Sakshi

ఒక్క క్షణం ఆలోచించు

ప్రాణాలను బలిగొంటున్న క్షణికావేశం
ఒత్తిళ్లను అధిగమించడంలో వైఫల్యం
చిన్నపాటి సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వైనం


ఈ ఏడాది జూన్‌ వరకూ ఆత్మహత్యలు
రైతులు    –  23
చేనేత కార్మికులు – 4
విద్యార్థులు    – 37
ఇతరులు    – 352
మొత్తం        – 416


ఈ నెల 4న తాడిపత్రి ఉలిక్కిపడింది. సులోచనమ్మ, ఆమె కూతుళ్లు ప్రత్యూష, సాయిప్రతిభలను కన్నతండ్రి రామసుబ్బారెడ్డి కిరాతకంగా హతమార్చాడు. ఆ మరుసటి రోజే సమాజానికి భయపడిన అతనూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యసనాలకు బానిసైన రామసుబ్బారెడ్డి... క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి శాపమైంది. అందరినీ కోల్పోయి వారి మరో కుమార్తె ప్రసన్న అనాథగా మారింది.

ఈ ఏడాది మే 2న ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) కనసింహన్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేని ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు ఉన్నత విద్యావంతుడు. డివిజన్‌ స్థాయి అధికారి స్థాయికి ఎదిగిన వ్యక్తి. సుదీర్ఘకాలం ప్రభుత్వశాఖలో పనిచేసిన అనుభవం. అయినా వేధింపులను తట్టుకోలేని ఆయన ఉరివేసుకున్నారు.

అనంతపురం సెంట్రల్‌: చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి.. కుటుంబ పోషణ భారంగా మారిందని యజమాని.. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఇల్లాలు.. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదంటూ వృద్ధులు.. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు... ఇలా కారణాలు ఏమైనా కావచ్చు.. సమస్యకు పరిష్కారం ఆత్మహత్యనే సమాధానంగా పలువురు భావిస్తున్నారు. ఇందులో నిరక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు అన్న తేడా లేదు. ప్రతి ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. అయితే సమస్యకు ఆత్మహత్య కానేకాదు అనేది చాలా మంది గుర్తించకపోవడం వల్లనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయనేది నగ్నసత్యం.

బతికున్న వారికి క్షోభ
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారు మన ఎదుట లేకపోయినా.. వారి జ్ఞాపకాలతో బతికున్న వారికి నిత్యమూ క్షోభ మిగులుతోంది. క్లిష్ట సమయంలో కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమై పోతుంది. ప్రధానంగా ఇంటి పెద్ద, వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడుకున్న బిడ్డలు అర్ధాంతరంగా తనువు చాలిస్తే.. బతికున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది. సంసారమనే సముద్రంలో సాఫీగా సాగిపోతున్న జీవిత నౌక ఒక్కసారిగా తుఫానులో చిక్కుకున్న ఛిద్రమై పోతే అందులోని వారి పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఒక్క క్షణం ఆలోచిస్తే..
కొన్ని పనులను కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. దీనికి ప్రత్యామ్నాయం ఉండదు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ఒక్క క్షణం తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని మరెవ్వరూ పూర్తి చేయలేరనే విషయాన్ని గుర్తించాలి. తనకు ప్రత్యామ్నాయం మరొకరు ఉండరనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులకు తాను లేని లోటు మరో వ్యక్తి తీర్చలేడనే నగ్నసత్యాన్ని మరవరాదు. ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి సమస్యలు, సవాళ్లు ఉంటాయి. సమస్య ఏదైనా ధైర్యంగా ఎదుర్కొవాలే కాని, చావే పరిష్కారం కాదనే విషయాన్ని మరవరాదు. తాను చనిపోయిన తర్వాత కుటుంబంలో చోటు చేసుకునే పరిణామాలపై కూడా ఒక్కసారి ఆలోచిస్తే.. తాను ఎంత తప్పు చేస్తున్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.  

కుటుంబ కలహాలతోనే ఎక్కువ
జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యలను పరిశీలిస్తే ఎక్కువ శాతం కుటుంబ కలహాలతో జరుగుతున్నవే కావడం గమనార్హం. చిన్నపాటి సమస్యలకే మనస్పర్థలు చోటు చేసుకుని హత్యలకు తెగబడడం, లేదంటే ఆత్మహత్యలకు పాల్పడం జరుగుతోంది. వరకట్న వేధింపులు, భార్య,భర్తల మధ్య పెరుగుతున్న అంతరం, వివాహేతర సంబంధాలు, రుణ బాధలు... ఇలా కారణమేదైనా.. ఇటీవల ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోయాయి. ఈ విషయంలో పామరులే కాదు మేధావి వర్గాలు సైతం తప్పుటడుగులు వేయడం ఆందోళనకరం. ఇటీవల అనంతపురంలోనే  ప్రభుత్వ అధికారుల భార్యలు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అదనపు కట్నం కోసం వేధింపులు తాళలేక ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

తగ్గిపోతున్న పెద్దరికం
ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కనుమరుగైన తర్వాత మానవసంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. సమస్యలు ఎదురైనప్పుడు ఉమ్మడి కుటుంబాల సభ్యులందరూ రెండు, మూడు గంటల పాటు కలిసి మెలసి సాదకబాధకాలను పంచుకోవడం ద్వారా భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లేవారు. దీంతో ఆత్మహత్యలకు తావులేకుండా పోయేది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకూ ఏదో ఒక సమస్యతో అందరూ ఒత్తిళ్లతోనే గడపాల్సి వస్తోంది. ఫలితంగా ఆవేశపూరితమైన నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు.  జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు తెగబడుతున్నారు.

ఆత్మహత్యల వివరాలు ఇలా :
సంవత్సరం    రైతులు    చేనేత కార్మికులు    విద్యార్థులు    ఇతరులు    మొత్తం     
2013             60        19                          44              679            802    
2014             57         9                           65              647           778    
2015            119       13                          48              680           860    
2016             62        9                            46              702           819    
2017(జూన్‌)    23       4                             37              352          416    
మొత్తం           321    54                            240            3060       3675    
 

తప్పకుండా సాయం
జిల్లాలో వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మంది వారి సమస్య బయటకు చెప్పుకోకుండానే తనువు చాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం. మరీ సమస్య తీవ్రత ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాను. ఆత్మహత్యలు నివారించడానికి గుజరాత్‌లో విజయవంతంగా ఓ హెల్ప్‌లైన్‌ పనిచేస్తోంది. అదే తరహాలో ఇక్కడ అమలు చేయడానికి కృషి చేస్తా. ప్రస్తుతానికి అత్యవసరం, ఆపదలో ఉన్న వ్యక్తులు 100ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తాం.
- జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement