పోలీసు ప్రతిష్ట పెంచుతాం | sp gvg ashok kumar sakshi interview | Sakshi
Sakshi News home page

పోలీసు ప్రతిష్ట పెంచుతాం

Published Fri, Jul 14 2017 11:20 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పోలీసు ప్రతిష్ట పెంచుతాం - Sakshi

పోలీసు ప్రతిష్ట పెంచుతాం

అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం
– పేకాట, మట్కా నియంత్రణకు ప్రత్యేక కూంబింగ్‌
– తాడిపత్రి, పేరూరుపై నిరంతర నిఘా.. మట్కా బీటర్ల సంగతి తేలుస్తాం
– ఎక్కడ జరిగితే అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి.. ఎవ్వరినీ ఉపేక్షించం
– సైబర్‌ నేరాలు, మిస్సింగ్‌ కేసులకు ప్రత్యేక శిక్షణ బృందాలు
– ప్రజలు, వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాల సంఖ్య పెంపు
– పోలీసుల సంక్షేమానికి పెద్దపీట
– ‘సాక్షి’తో జిల్లా పోలీస్‌ బాస్‌ జీవీజీ అశోక్‌కుమార్‌


సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పోలీసులు గట్టిగా ఉంటే 60 శాతం నేరాలు నియంత్రించినట్లే. ఆపై ఉన్న 40శాతాన్ని అదుపు చేయడం తేలిక. పేకాట, మట్కా, బెట్టింగ్‌ లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏ ప్రాంతం వారు వచ్చి ఆడినా ఎక్కడ ఆడుతున్నారో అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి. వీటి కోసం ప్రత్యేకంగా బృందాలను సిద్ధం చేసి కూంబింగ్‌ నిర్వహిస్తాం. బాధ్యులుగా తేలితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. జిల్లాలో అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తేనే పోలీసుశాఖ ప్రతిష్టను పెంచినవారమవుతాం. దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటాం.’ అని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. ‘అనంత’ పోలీస్‌బాస్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

సాక్షి : ఇది వరకు అనంతలో పనిచేసిన అనుభవం ఉంది? అప్పటికీ, ఇప్పటికీ బాధ్యతల్లో తేడా ఉంది? రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైన జిల్లా? కొత్త బాధ్యతపై ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు?
అశోక్‌ : అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. అప్పట్లో నేరాల సంఖ ఎక్కువగా ఉండేది. ఫ్యాక‌్షన్‌ తీవ్రత, సూడోనక్సల్స్‌తో జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. నేరాల తీవ్రత తగ్గింది. అయితే పేకాట, మట్కా, బెట్టింగ్‌ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జిల్లాను కుదిపేస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
సాక్షి : తాడిపత్రి, పీఏబీఆర్‌డ్యాం, కౌకుంట్ల ప్రాంతాల్లో పేకాట అధికంగా నడుస్తోంది? ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. అయినా నియంత్రణ లేదు?
అశోక్‌ :  నిజమే. పేకాట అధికంగా జరుగుతోంది. ప్రత్యేక బృందాలను సిద్ధం చేసి కూంబింగ్‌ నిర్వహిస్తాం. పీఏబీఆర్‌లో తరచూ కూంబింగ్‌ నిర్వహించి దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవే కాదు, జిల్లాలో పేకాట, మట్కా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.
సాక్షి : తాడిపత్రి సంగతేంటి? పేకాట, మట్కా, బెట్టింగ్‌కు అడ్డాగా మారిపోయింది?
అశోక్‌ : పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశాం. నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ చెబుతున్నారు. ప్రస్తుతం ఆట ఆగింది. అంతా ఊరు వదిలి వెళ్లిపోయారు. పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీకూడా చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో గట్టినే ఉంటాం. ఈ ఘటనలు ఏ జ్యుడిషియరీలో జరిగితే అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి. ఇతర జిల్లాలు, కర్ణాటక పోలీసులతో కూడా చర్చించి అడ్డుకట్ట వేస్తాం.
సాక్షి : ఇవన్నీ పోలీసులకు తెలిసే జరుగుతున్నాయి. అందుకే నియంత్రణ కష్టసాధ్యమనే భావన ప్రజల్లో ఉంది.
అశోక్‌: పోలీసులకు తెలిసే జరుగుతోందనే అపవాదు మొదట పోవాలి. దీనికి పోలీసులు కూడా చొరవ చూపాలి. దీనివల్ల 60శాతం నియంత్రణ వస్తుంది. ఆపై తక్కిన 40శాతాన్ని అదుపు చేయడం పెద్ద సమస్య కాదు. నియంత్రణలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు తెలితే వారిపై కూడా చర్యలు తప్పవు.
సాక్షి : క్రికెట్‌ బెట్టింగ్, మట్కా కూడా ఇటీవల అనంతపురంలో తీవ్రమైంది?  
అశోక్‌ : ‘అనంతే’ కాదు...ఐపీఎల్‌ వచ్చాక అన్నిచోట్ల బెట్టింగ్‌ జోరు పెరిగింది. ప్రొద్దుటూరు దగ్గరగా ఉండటం కూడా కారణం కావొచ్చు. బుకీలు, సబ్‌బుకీలు ఎవరు అనేది లిస్ట్‌ తయారు చేస్తున్నాం. కచ్చితంగా వీరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి నిఘా ఉంచుతాం.
సాక్షి : ఎస్‌ఐ నుంచి ఎస్పీ వరకూ వచ్చే ఫిర్యాదుల్లో సివిల్‌ కేసులు అధికంగా ఉన్నాయి? వీటి నియంత్రణకు ముగ్గురు డీఎస్పీలతో ఓ కమిటీ కూడా ఉంది? అయినా తీరు మారలేదు?
అశోక్‌ :  కచ్చితంగా! నేను బాధ్యత తీసుకున్నాక వచ్చిన పది ఫిర్యాదుల్లో 7 సివిల్‌ కేసులు ఉన్నాయి? పొలాల సమస్యలు, వడ్డీవ్యాపారులతో ఇబ్బందులు.. అంతా ఇవే చెబుతున్నారు. డీఎస్పీలతో ఉన్న కమిటీ పనితీరుపై సమీక్షించి, ఏది ‘బెస్ట్‌’ అయితే దాన్ని అమలు చేస్తాం. సివిల్‌ కేసుల్లో 145 సీఆర్‌పీసీ మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. దీనిపై కఠినంగానే ఉంటాం.
సాక్షి : ప్రజల గ్రీవెన్స్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
అశోక్‌ : సోమవారం పూర్తిగా గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తాం. నేను అందుబాటులో ఉంటే రోజుతో పనిలే లేకుండా ఎవ్వరు, ఎప్పుడైనా సరే వచ్చి సమస్యను విన్నవించుకోవచ్చు. ప్రజల సంరక్షణ కోసమే పోలీసులు ఉన్నారు. వారి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత.
సాక్షి : కాల్‌మనీ ఉదంతాలు కూడా అధికంగా ఉన్నాయి? వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
అశోక్‌ : విజయవాడలో కాల్‌మనీ సెల్‌పెట్టాం. పోలీసులు, బార్‌అసోసియేషన్, వ్యాపారులతో పాటు పలువురు ప్రతినిధులతో ఓ కమిటీ వేశాం. బాధితులు, వ్యాపారులను పిలిపించి వారితో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేవాళ్లం. మంచి ఫలితాలు వచ్చాయి? ఇక్కడి పరిస్థితులను బట్టి అమలు చేస్తాం. ఇందులో పోలీసులకు చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకుని ముందుకెళ్తాం.
సాక్షి : పట్టణాల్లో సీసీ కెమెరాలను మరింతగా పెంచడంతో పాటు ప్రజలు నివసించే కాలనీల్లో కూడా ఉంటే నేరాల తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉంది కదా?
అశోక్‌ : పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరిన్ని పెంచుతాం. కానీ ప్రతీ సర్కిల్, కాలనీ అంటే కష్టమే! కాలనీల్లో పెడితే బాగుంటుంది. దీనికి ప్రజల సహకారం అవసరం. కాలనీ అసోసియేషన్‌ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోలీసుశాఖ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం. ఇది ఖరీదైన వ్యవహారం కాదు. తక్కువ ధరకే నాణ్యమైన కెమెరాలు లభిస్తున్నాయి. వ్యాపారులు, ప్రజలు ముందుకొచ్చి కెమెరాలు అమర్చుకుంటే నేరాల నియంత్రణ సులువవుతుంది. మాల్స్‌తో పాటు రద్దీ ఉంటే వ్యాపారులు, ఆస్పత్రులు యాజమాన్యాలు పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్టు ప్రకారం కచ్చితంగా కెమెరాలు అమర్చాలి. దీనిపై అవగాహన కల్పిస్తాం.
సాక్షి : సైబర్‌ క్రైం కేసులు కూడా ఎక్కువయ్యాయి?
అశోక్‌ : ఎస్‌. ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సబ్‌డివిజన్‌లో ఇంజనీరింగ్‌ లాంటి టెక్నికల్‌ కోర్సులు చేసిన ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి సైబర్‌టూల్స్‌పై శిక్షణకు ఇప్పిస్తాం. దీనిపై ప్రణాళిక ఉంది.
సాక్షి : డ్రంకెన్‌ డ్రైవ్‌ పరిస్థితి ఏంటి?
అశోక్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు ఉంచాలి. రోజూ తనిఖీలు నిర్వహించేలా ట్రాఫిక్‌ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తాం.  
సాక్షి : మాజీ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీకి చెందిన ముఖ్యనేతలకు గన్‌మెన్లను తొలగించారు? వీరి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా?  
అశోక్‌ : దీన్ని ఎస్‌ఆర్‌సీ(స్టేట్‌ రివ్యూ కమిటీ) సమీక్షిస్తుంది. ఎవరికి గన్‌మెన్లు అవసరం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని కమిటీ సమీక్షించి గన్‌మెన్లు అవసరమా? ఉచితంగా ఇవ్వాలా? పేమెంట్‌ కింద ఇవ్వాలా? అని నిర్ణయం తీసుకుంటుంది.
సాక్షి : మిస్సింగ్‌ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి?
అశోక్‌ : నిజమే. వీటిని ప్రాధాన్యతగా తీసుకుంటాం. మైనర్‌ బాలికలతో పాటు బాలుర మిస్సింగ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. దీనికి సబ్‌డివిజన్‌కు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. సీరియస్‌గా తీసుకుంటాం. మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు షీటీమ్స్‌ తరహాలో ప్రత్యేక వ్యవస్థను కూడా తయారు చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఈవ్‌ టీజింగ్‌ ఎక్కువగా ఉంది. కొందరు ట్రాప్‌ చేసి మోసం చేస్తున్నా. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తాం. కాలేజీల్లో కూడా పోలీసులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తాం.   
సాక్షి : పోలీసు సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?    
అశోక్‌ : అమలవుతున్న వాటిని మరింత బలోపేతం చేస్తాం. పెద్ద జిల్లా. వందల కిలోమీటర్ల దూరంలో సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటా. వీరి సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటా. అసోసియేషన్‌ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిని తప్పకుండా పరిష్కరిస్తాం.
సాక్షి : పోలీసు క్వార్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి? సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు?
అశోక్‌ : క్వార్టర్ల మరమ్మతులకు రూ.కోటి మంజూరైంది. మరమ్మతులు చేయిస్తాం. క్వార్టర్లలో లేని వారికి హెచ్‌ఆర్‌ఏ కట్‌ అవుతోంది. ఈ సమస్య కాస్త జటిలంగా ఉంది. పరిష్కరించే ప్రయత్నం చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement