gvg ashok kumar
-
అవినీతిపరులపై ఎస్పీ నిఘా
– ఇప్పటికే పలువురు సీఐలపై వేటు – మరో ఎస్ఐ వీఆర్‌కు రంగం సిద్ధం అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై ఎస్పీ అశోక్‌కుమార్ నిఘా ఉంచి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒకేసారి ఐదుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. వీరంతా వీఆర్‌కు వెళ్లడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశం అయింది. విధి నిర్వహణలో విమర్శలు ఎదుర్కొంటున్నట్లు వీరిలో కొంతమందిపై అభియోగాలు ఉన్నాయి. అందులో భాగంగా కొంతమందిపై వేటు వేసినట్లు చర్చించుకుంటున్నారు. తాజాగా తాడిపత్రి డివిజన్లో ఓ ఎస్ఐపై వేటుకు రంగం సిద్దమైంది. మట్కా, పేకాటరాయుళ్లతో సంబంధాలు పెట్టుకున్నారని విచారణలో తేలడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడురోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసువర్గాల ద్వారా తెలిసింది. -
విజయవాడకు వెళ్లిన ఎస్పీ
అనంతపురం సెంట్రల్: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బుధవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాజధానిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం జిల్లాకు రానున్నట్లు పోలీసు కార్యాలయవర్గాలు వెల్లడించాయి. -
నేరుగా రంగంలోకి ఎస్పీ
అనంతపురం సెంట్రల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. ఆటోలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతో స్వయంగా వాహనాలు ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల 8న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉండడంతో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎస్పీ శుక్రవారం ఉరవకొండకు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యంలో చిన్నముష్టూరు, పెన్నహోబిళం వద్ద పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్, ఆటోలను ఎస్పీ గమనించారు. కూలీలను దింపి వారికి రోడ్డు ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. పరిమితికి మించి వాహనాల్లో రాకపోకలు సాగిస్తుండడం వలన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ప్రయాణం కంటే సురక్షితం ముఖ్యమన్నారు. అనంతరం కూలీలను మరో వాహనం ద్వారా వారి గమ్యస్థానాలకు పంపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మల్లికార్జున, ఇంటెలిజెన్స్ డీఎస్పీ రామకృష్ణయ్య, సీఐ తేజోమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ నర్సింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క క్షణం ఆలోచించు
ప్రాణాలను బలిగొంటున్న క్షణికావేశం ఒత్తిళ్లను అధిగమించడంలో వైఫల్యం చిన్నపాటి సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వైనం ఈ ఏడాది జూన్ వరకూ ఆత్మహత్యలు రైతులు – 23 చేనేత కార్మికులు – 4 విద్యార్థులు – 37 ఇతరులు – 352 మొత్తం – 416 ఈ నెల 4న తాడిపత్రి ఉలిక్కిపడింది. సులోచనమ్మ, ఆమె కూతుళ్లు ప్రత్యూష, సాయిప్రతిభలను కన్నతండ్రి రామసుబ్బారెడ్డి కిరాతకంగా హతమార్చాడు. ఆ మరుసటి రోజే సమాజానికి భయపడిన అతనూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యసనాలకు బానిసైన రామసుబ్బారెడ్డి... క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి శాపమైంది. అందరినీ కోల్పోయి వారి మరో కుమార్తె ప్రసన్న అనాథగా మారింది. ఈ ఏడాది మే 2న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) కనసింహన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేని ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు ఉన్నత విద్యావంతుడు. డివిజన్ స్థాయి అధికారి స్థాయికి ఎదిగిన వ్యక్తి. సుదీర్ఘకాలం ప్రభుత్వశాఖలో పనిచేసిన అనుభవం. అయినా వేధింపులను తట్టుకోలేని ఆయన ఉరివేసుకున్నారు. అనంతపురం సెంట్రల్: చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి.. కుటుంబ పోషణ భారంగా మారిందని యజమాని.. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఇల్లాలు.. కన్న కొడుకులు పట్టించుకోవడం లేదంటూ వృద్ధులు.. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు... ఇలా కారణాలు ఏమైనా కావచ్చు.. సమస్యకు పరిష్కారం ఆత్మహత్యనే సమాధానంగా పలువురు భావిస్తున్నారు. ఇందులో నిరక్షరాస్యులు, ఉన్నత విద్యావంతులు అన్న తేడా లేదు. ప్రతి ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. అయితే సమస్యకు ఆత్మహత్య కానేకాదు అనేది చాలా మంది గుర్తించకపోవడం వల్లనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయనేది నగ్నసత్యం. బతికున్న వారికి క్షోభ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారు మన ఎదుట లేకపోయినా.. వారి జ్ఞాపకాలతో బతికున్న వారికి నిత్యమూ క్షోభ మిగులుతోంది. క్లిష్ట సమయంలో కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమై పోతుంది. ప్రధానంగా ఇంటి పెద్ద, వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడుకున్న బిడ్డలు అర్ధాంతరంగా తనువు చాలిస్తే.. బతికున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది. సంసారమనే సముద్రంలో సాఫీగా సాగిపోతున్న జీవిత నౌక ఒక్కసారిగా తుఫానులో చిక్కుకున్న ఛిద్రమై పోతే అందులోని వారి పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క క్షణం ఆలోచిస్తే.. కొన్ని పనులను కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. దీనికి ప్రత్యామ్నాయం ఉండదు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ఒక్క క్షణం తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని మరెవ్వరూ పూర్తి చేయలేరనే విషయాన్ని గుర్తించాలి. తనకు ప్రత్యామ్నాయం మరొకరు ఉండరనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులకు తాను లేని లోటు మరో వ్యక్తి తీర్చలేడనే నగ్నసత్యాన్ని మరవరాదు. ప్రతి కుటుంబంలోనూ చిన్నపాటి సమస్యలు, సవాళ్లు ఉంటాయి. సమస్య ఏదైనా ధైర్యంగా ఎదుర్కొవాలే కాని, చావే పరిష్కారం కాదనే విషయాన్ని మరవరాదు. తాను చనిపోయిన తర్వాత కుటుంబంలో చోటు చేసుకునే పరిణామాలపై కూడా ఒక్కసారి ఆలోచిస్తే.. తాను ఎంత తప్పు చేస్తున్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలతోనే ఎక్కువ జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యలను పరిశీలిస్తే ఎక్కువ శాతం కుటుంబ కలహాలతో జరుగుతున్నవే కావడం గమనార్హం. చిన్నపాటి సమస్యలకే మనస్పర్థలు చోటు చేసుకుని హత్యలకు తెగబడడం, లేదంటే ఆత్మహత్యలకు పాల్పడం జరుగుతోంది. వరకట్న వేధింపులు, భార్య,భర్తల మధ్య పెరుగుతున్న అంతరం, వివాహేతర సంబంధాలు, రుణ బాధలు... ఇలా కారణమేదైనా.. ఇటీవల ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోయాయి. ఈ విషయంలో పామరులే కాదు మేధావి వర్గాలు సైతం తప్పుటడుగులు వేయడం ఆందోళనకరం. ఇటీవల అనంతపురంలోనే ప్రభుత్వ అధికారుల భార్యలు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అదనపు కట్నం కోసం వేధింపులు తాళలేక ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తగ్గిపోతున్న పెద్దరికం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కనుమరుగైన తర్వాత మానవసంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. సమస్యలు ఎదురైనప్పుడు ఉమ్మడి కుటుంబాల సభ్యులందరూ రెండు, మూడు గంటల పాటు కలిసి మెలసి సాదకబాధకాలను పంచుకోవడం ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లేవారు. దీంతో ఆత్మహత్యలకు తావులేకుండా పోయేది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకూ ఏదో ఒక సమస్యతో అందరూ ఒత్తిళ్లతోనే గడపాల్సి వస్తోంది. ఫలితంగా ఆవేశపూరితమైన నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. ఆత్మహత్యల వివరాలు ఇలా : సంవత్సరం రైతులు చేనేత కార్మికులు విద్యార్థులు ఇతరులు మొత్తం 2013 60 19 44 679 802 2014 57 9 65 647 778 2015 119 13 48 680 860 2016 62 9 46 702 819 2017(జూన్) 23 4 37 352 416 మొత్తం 321 54 240 3060 3675 తప్పకుండా సాయం జిల్లాలో వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మంది వారి సమస్య బయటకు చెప్పుకోకుండానే తనువు చాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం. మరీ సమస్య తీవ్రత ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాను. ఆత్మహత్యలు నివారించడానికి గుజరాత్లో విజయవంతంగా ఓ హెల్ప్‌లైన్ పనిచేస్తోంది. అదే తరహాలో ఇక్కడ అమలు చేయడానికి కృషి చేస్తా. ప్రస్తుతానికి అత్యవసరం, ఆపదలో ఉన్న వ్యక్తులు 100ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తాం. - జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
జీవీజీ అశోక్ 9989819191
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం - సమాచారం ఇస్తే చర్యలకు శ్రీకారం - ఫోన్.. మెసేజ్.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ - బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట నిర్మూలనే ధ్యేయం అనంతపురం సెంట్రల్: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని.. బెల్టు షాపుల నిర్వహణ, మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఈవ్‌టీజింగ్‌పై తన సెల్‌ఫోన్ 9989819191 నెంబర్‌కు సమాచారం అందించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. నేరుగా కాల్ చేసినా.. ఎస్ఎంఎస్ పంపినా.. వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసినా ఫిర్యాదును స్వీకరిస్తామన్నారు. డయల్ 100 కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అసాంఘిక కార్యకలాపాలతో పాటు రోడ్డు ప్రమాదాలు, అల్లర్లు, ఇతర ఆపద సమయాల్లోనూ ఈ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఈ నెంబర్లు పూర్తిగా తన స్వీయ పర్యవేక్షణలో ఉంటాయని.. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం : ఎస్పీ
కదిరి: అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన కదిరిలోని పోలీస్ గెస్ట్ హౌస్‌లో డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌తో కలిసి సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మట్కా, గ్యాంబ్లింగ్, లాటరీ నిర్వాహకులు ఎంతటివారైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. కదిరి ప్రాంతంలో ఇటీవల చిన్నపిల్లల అపహరణలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇక పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దానికోసం ప్రత్యేకంగా ఒక ఎస్ఐతో పాటు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక్కో కానిస్టేబుల్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు కూత వేటుదూరంలో రిక్రియేషన్ ముసుగులో పేకాట జోరుగా సాగుతోందన్న విలేకరుల ప్రశ్నకు తాను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఆయన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. -
పోలీసు ప్రతిష్ట పెంచుతాం
అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తాం – పేకాట, మట్కా నియంత్రణకు ప్రత్యేక కూంబింగ్ – తాడిపత్రి, పేరూరుపై నిరంతర నిఘా.. మట్కా బీటర్ల సంగతి తేలుస్తాం – ఎక్కడ జరిగితే అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి.. ఎవ్వరినీ ఉపేక్షించం – సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసులకు ప్రత్యేక శిక్షణ బృందాలు – ప్రజలు, వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాల సంఖ్య పెంపు – పోలీసుల సంక్షేమానికి పెద్దపీట – ‘సాక్షి’తో జిల్లా పోలీస్ బాస్ జీవీజీ అశోక్‌కుమార్ సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘పోలీసులు గట్టిగా ఉంటే 60 శాతం నేరాలు నియంత్రించినట్లే. ఆపై ఉన్న 40శాతాన్ని అదుపు చేయడం తేలిక. పేకాట, మట్కా, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏ ప్రాంతం వారు వచ్చి ఆడినా ఎక్కడ ఆడుతున్నారో అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి. వీటి కోసం ప్రత్యేకంగా బృందాలను సిద్ధం చేసి కూంబింగ్ నిర్వహిస్తాం. బాధ్యులుగా తేలితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. జిల్లాలో అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తేనే పోలీసుశాఖ ప్రతిష్టను పెంచినవారమవుతాం. దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటాం.’ అని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ‘అనంత’ పోలీస్‌బాస్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి : ఇది వరకు అనంతలో పనిచేసిన అనుభవం ఉంది? అప్పటికీ, ఇప్పటికీ బాధ్యతల్లో తేడా ఉంది? రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైన జిల్లా? కొత్త బాధ్యతపై ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? అశోక్ : అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. అప్పట్లో నేరాల సంఖ ఎక్కువగా ఉండేది. ఫ్యాక్షన్ తీవ్రత, సూడోనక్సల్స్తో జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. నేరాల తీవ్రత తగ్గింది. అయితే పేకాట, మట్కా, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జిల్లాను కుదిపేస్తున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. సాక్షి : తాడిపత్రి, పీఏబీఆర్డ్యాం, కౌకుంట్ల ప్రాంతాల్లో పేకాట అధికంగా నడుస్తోంది? ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. అయినా నియంత్రణ లేదు? అశోక్ : నిజమే. పేకాట అధికంగా జరుగుతోంది. ప్రత్యేక బృందాలను సిద్ధం చేసి కూంబింగ్ నిర్వహిస్తాం. పీఏబీఆర్‌లో తరచూ కూంబింగ్ నిర్వహించి దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవే కాదు, జిల్లాలో పేకాట, మట్కా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సాక్షి : తాడిపత్రి సంగతేంటి? పేకాట, మట్కా, బెట్టింగ్‌కు అడ్డాగా మారిపోయింది? అశోక్ : పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశాం. నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ చెబుతున్నారు. ప్రస్తుతం ఆట ఆగింది. అంతా ఊరు వదిలి వెళ్లిపోయారు. పోలీసులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీకూడా చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో గట్టినే ఉంటాం. ఈ ఘటనలు ఏ జ్యుడిషియరీలో జరిగితే అక్కడి పోలీసులే బాధ్యత తీసుకోవాలి. ఇతర జిల్లాలు, కర్ణాటక పోలీసులతో కూడా చర్చించి అడ్డుకట్ట వేస్తాం. సాక్షి : ఇవన్నీ పోలీసులకు తెలిసే జరుగుతున్నాయి. అందుకే నియంత్రణ కష్టసాధ్యమనే భావన ప్రజల్లో ఉంది. అశోక్: పోలీసులకు తెలిసే జరుగుతోందనే అపవాదు మొదట పోవాలి. దీనికి పోలీసులు కూడా చొరవ చూపాలి. దీనివల్ల 60శాతం నియంత్రణ వస్తుంది. ఆపై తక్కిన 40శాతాన్ని అదుపు చేయడం పెద్ద సమస్య కాదు. నియంత్రణలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు తెలితే వారిపై కూడా చర్యలు తప్పవు. సాక్షి : క్రికెట్ బెట్టింగ్, మట్కా కూడా ఇటీవల అనంతపురంలో తీవ్రమైంది? అశోక్ : ‘అనంతే’ కాదు...ఐపీఎల్ వచ్చాక అన్నిచోట్ల బెట్టింగ్ జోరు పెరిగింది. ప్రొద్దుటూరు దగ్గరగా ఉండటం కూడా కారణం కావొచ్చు. బుకీలు, సబ్‌బుకీలు ఎవరు అనేది లిస్ట్ తయారు చేస్తున్నాం. కచ్చితంగా వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి నిఘా ఉంచుతాం. సాక్షి : ఎస్ఐ నుంచి ఎస్పీ వరకూ వచ్చే ఫిర్యాదుల్లో సివిల్ కేసులు అధికంగా ఉన్నాయి? వీటి నియంత్రణకు ముగ్గురు డీఎస్పీలతో ఓ కమిటీ కూడా ఉంది? అయినా తీరు మారలేదు? అశోక్ : కచ్చితంగా! నేను బాధ్యత తీసుకున్నాక వచ్చిన పది ఫిర్యాదుల్లో 7 సివిల్ కేసులు ఉన్నాయి? పొలాల సమస్యలు, వడ్డీవ్యాపారులతో ఇబ్బందులు.. అంతా ఇవే చెబుతున్నారు. డీఎస్పీలతో ఉన్న కమిటీ పనితీరుపై సమీక్షించి, ఏది ‘బెస్ట్’ అయితే దాన్ని అమలు చేస్తాం. సివిల్ కేసుల్లో 145 సీఆర్పీసీ మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. దీనిపై కఠినంగానే ఉంటాం. సాక్షి : ప్రజల గ్రీవెన్స్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? అశోక్ : సోమవారం పూర్తిగా గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తాం. నేను అందుబాటులో ఉంటే రోజుతో పనిలే లేకుండా ఎవ్వరు, ఎప్పుడైనా సరే వచ్చి సమస్యను విన్నవించుకోవచ్చు. ప్రజల సంరక్షణ కోసమే పోలీసులు ఉన్నారు. వారి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత. సాక్షి : కాల్‌మనీ ఉదంతాలు కూడా అధికంగా ఉన్నాయి? వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అశోక్ : విజయవాడలో కాల్‌మనీ సెల్పెట్టాం. పోలీసులు, బార్అసోసియేషన్, వ్యాపారులతో పాటు పలువురు ప్రతినిధులతో ఓ కమిటీ వేశాం. బాధితులు, వ్యాపారులను పిలిపించి వారితో కౌన్సెలింగ్ ఇచ్చి పంపేవాళ్లం. మంచి ఫలితాలు వచ్చాయి? ఇక్కడి పరిస్థితులను బట్టి అమలు చేస్తాం. ఇందులో పోలీసులకు చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకుని ముందుకెళ్తాం. సాక్షి : పట్టణాల్లో సీసీ కెమెరాలను మరింతగా పెంచడంతో పాటు ప్రజలు నివసించే కాలనీల్లో కూడా ఉంటే నేరాల తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉంది కదా? అశోక్ : పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరిన్ని పెంచుతాం. కానీ ప్రతీ సర్కిల్, కాలనీ అంటే కష్టమే! కాలనీల్లో పెడితే బాగుంటుంది. దీనికి ప్రజల సహకారం అవసరం. కాలనీ అసోసియేషన్ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోలీసుశాఖ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం. ఇది ఖరీదైన వ్యవహారం కాదు. తక్కువ ధరకే నాణ్యమైన కెమెరాలు లభిస్తున్నాయి. వ్యాపారులు, ప్రజలు ముందుకొచ్చి కెమెరాలు అమర్చుకుంటే నేరాల నియంత్రణ సులువవుతుంది. మాల్స్‌తో పాటు రద్దీ ఉంటే వ్యాపారులు, ఆస్పత్రులు యాజమాన్యాలు పబ్లిక్ సెక్యూరిటీ యాక్టు ప్రకారం కచ్చితంగా కెమెరాలు అమర్చాలి. దీనిపై అవగాహన కల్పిస్తాం. సాక్షి : సైబర్ క్రైం కేసులు కూడా ఎక్కువయ్యాయి? అశోక్ : ఎస్. ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సబ్‌డివిజన్‌లో ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు చేసిన ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి సైబర్టూల్స్పై శిక్షణకు ఇప్పిస్తాం. దీనిపై ప్రణాళిక ఉంది. సాక్షి : డ్రంకెన్ డ్రైవ్ పరిస్థితి ఏంటి? అశోక్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ఉంచాలి. రోజూ తనిఖీలు నిర్వహించేలా ట్రాఫిక్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తాం. సాక్షి : మాజీ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీకి చెందిన ముఖ్యనేతలకు గన్మెన్లను తొలగించారు? వీరి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా? అశోక్ : దీన్ని ఎస్ఆర్సీ(స్టేట్ రివ్యూ కమిటీ) సమీక్షిస్తుంది. ఎవరికి గన్మెన్లు అవసరం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని కమిటీ సమీక్షించి గన్మెన్లు అవసరమా? ఉచితంగా ఇవ్వాలా? పేమెంట్ కింద ఇవ్వాలా? అని నిర్ణయం తీసుకుంటుంది. సాక్షి : మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి? అశోక్ : నిజమే. వీటిని ప్రాధాన్యతగా తీసుకుంటాం. మైనర్ బాలికలతో పాటు బాలుర మిస్సింగ్ కేసులు అధికంగా ఉన్నాయి. దీనికి సబ్‌డివిజన్‌కు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. సీరియస్‌గా తీసుకుంటాం. మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు షీటీమ్స్ తరహాలో ప్రత్యేక వ్యవస్థను కూడా తయారు చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ ఎక్కువగా ఉంది. కొందరు ట్రాప్ చేసి మోసం చేస్తున్నా. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తాం. కాలేజీల్లో కూడా పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. సాక్షి : పోలీసు సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? అశోక్ : అమలవుతున్న వాటిని మరింత బలోపేతం చేస్తాం. పెద్ద జిల్లా. వందల కిలోమీటర్ల దూరంలో సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటా. వీరి సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటా. అసోసియేషన్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిని తప్పకుండా పరిష్కరిస్తాం. సాక్షి : పోలీసు క్వార్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి? సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు? అశోక్ : క్వార్టర్ల మరమ్మతులకు రూ.కోటి మంజూరైంది. మరమ్మతులు చేయిస్తాం. క్వార్టర్లలో లేని వారికి హెచ్ఆర్ఏ కట్ అవుతోంది. ఈ సమస్య కాస్త జటిలంగా ఉంది. పరిష్కరించే ప్రయత్నం చేస్తా. -
వాహన లైసెన్సు తప్పనిసరి
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాల నడిపే వారిపై ముమ్మర తనిఖీలు చేపడుతామన్నారు. అన్ని పోలీసు స్టేషన్ అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. వాహన ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కొందరు యజమానులు తమ వాహనాలను ఇతరులకు ఇచ్చే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నెలన్నర కిందట జిల్లాలో మడకశిర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుడికి ద్విచక్ర వాహనం ఇచ్చి పరోక్షంగా రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు చట్టరీత్యా నేరమన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతమైతే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన తనిఖీల సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. -
నేడు బాధ్యతలు తీసుకోనున్న నూతన ఎస్పీ
అనంతపురం సెంట్రల్ : జిల్లా ఎస్పీగా నియమితులైన జీవీజీ అశోక్‌కుమార్ సోమవారం భాధ్యతలు తీసుకోనున్నారని ఎస్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం ఇటీవల జిల్లా ఎస్పీగా బదిలీ చేసిన విషయం తెల్సిందే. దీంతో సోమవారం ఆయన జిల్లాకు చేరుకుని బాధ్యతలు తీసుకోనున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ రాజశేఖరబాబు చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఇప్పటికే ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు.