నేరుగా రంగంలోకి ఎస్పీ
అనంతపురం సెంట్రల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. ఆటోలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతో స్వయంగా వాహనాలు ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల 8న సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉండడంతో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎస్పీ శుక్రవారం ఉరవకొండకు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యంలో చిన్నముష్టూరు, పెన్నహోబిళం వద్ద పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్, ఆటోలను ఎస్పీ గమనించారు.
కూలీలను దింపి వారికి రోడ్డు ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. పరిమితికి మించి వాహనాల్లో రాకపోకలు సాగిస్తుండడం వలన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ప్రయాణం కంటే సురక్షితం ముఖ్యమన్నారు. అనంతరం కూలీలను మరో వాహనం ద్వారా వారి గమ్యస్థానాలకు పంపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మల్లికార్జున, ఇంటెలిజెన్స్ డీఎస్పీ రామకృష్ణయ్య, సీఐ తేజోమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ నర్సింగప్ప తదితరులు పాల్గొన్నారు.