తల్లీబిడ్డకు పునర్జన్మ!
అనంతపురం మెడికల్ : అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తల్లీబిడ్డకు పునర్జన్మనిచ్చారు ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు. శనివారం సూపరింటెండెంట్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్, గైనకాలజిస్ట్ పి.షబానా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనగానపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన చిట్టెక్క, రామాంజప్ప దంపతుల కుమార్తె లక్ష్మికి పావగడ తాలూకాలోని కొండకిందపల్లికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. గర్భిణి కావడంతో లక్ష్మి కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఈనెల 12న ప్రసవ నొప్పులు రావడంతో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు.
కిడ్నీ పాడవడంతోపాటు కామెర్లు కూడా ఉన్నాయి. రక్తంలో సోడియం లెవెల్స్ 125 మిల్లీమోల్స్ ఉండాల్సి ఉండగా 107 మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే మెదడులో నీరు చేరే ప్రమాదం ఎక్కువ. ఈ క్రమంలో 13వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు ఒకసారి, 4 గంటలకు మరోసారి లక్ష్మికి ఫిట్స్ వచ్చాయి. అప్పటి నుంచి వైద్య చికిత్సలు అందిస్తూ వచ్చారు. అదేరోజు సాయంత్రం ఆమె కోమాలోకి వెళ్లిపోవడంతో సిజేరియన్‌కు సిద్ధం చేశారు. సాధారణంగా సిజేరియన్ సమయంలో పూర్తి మత్తు ఇస్తారు. కానీ ఈమె విషయంలో గర్భాశయం ఇరువైపుల మాత్రమే మత్తు (ట్రాన్స్ అబ్డామినల్) ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇలా చేయడం అత్యంత క్లిష్టకరమైనది. ఆ తర్వాత 45 నిమిషాల్లో ఆపరేషన్ ముగించారు. మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
రాయలసీమలోనే ప్రప్రథమం
‘ట్రాన్స్ అబ్డామినల్’ చేయడం రాయలసీమలోనే ప్రప్రథమమని వైద్య బృందం తెలిపింది. లక్ష్మి గర్భం దాల్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, క్లిష్ట పరిస్థితుల్లో విజయవంతంగా ఆపరేషన్ చేశారని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ వైవీ రావు వైద్యులను అభినందించారు. తన కుమార్తె పరిస్థితి చూసి ఇక బతకదనుకున్నానని, ఇక్కడి డాక్టర్లు ప్రాణం పోశారని లక్ష్మి తల్లి చిట్టెక్క వైద్యులకు చేతులు జోడించింది.