గంధమహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
నెల్లూరు రూరల్: కసుమూరు దర్గా గంధమహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కసుమూరు దర్గా ఉత్సవంపై సంబంధిత అధికారులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాచలం మండలం కసుమూరు దర్గా గంధమహోత్సవాన్ని ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవం పూర్తయ్యేంత వరకు కసుమూరులో మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు చెప్పారు. పారిశుధ్య మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ, దర్గా కమిటీ, మండల నిధులను ఖర్చు పెట్టాలని తెలిపారు. రొట్టెల పండగ సందర్భంగా ఉపయోగించిన తాత్కాలిక టాయ్‌లెట్లను తీసుకెళ్లి ఏర్పాటు చేయాలన్నారు. మంచినీటికి కొరత లేకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసులకు సూచించారు. మండల రెవెన్యూ, పోలీస్, వక్ఫ్‌బోర్డు అధికారులు, దర్గా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.