kasumuru dargah
-
కసుమూరు దర్గాలో ఏఆర్ రహమాన్ ప్రార్థనలు
వెంకటాచలం: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దర్గాను దర్శించుకున్నారు. ఏటా జరిగే కసుమూరు దర్గా గంధోత్సవంలో కొన్నేళ్ల నుంచి రహమాన్ పాల్గొంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఏఆర్ రహమాన్ తన కుమారుడు అమీన్‌తో కలిసి దర్గా వద్దకు చేరుకున్నారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లాహుస్సేనీ మస్తాన్‌వలీ సమాధిపై చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసే సమయంలోనే ఏఆర్ రహమాన్ ప్రార్థనలు చేశారు. -
కసుమూరు దర్గాలో దొంగలు పడ్డారు
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా హుండీ వేలం వాయిదా పడడం దోపిడీదారులకు వరంగా మారింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వక్ఫ్ బోర్డు అధికారులు, కొందరు వ్యక్తులు హుండీలో భక్తులు వేసిన నగదును దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. వక్ఫ్ బోర్డులోని కొందరికి వాటాలు వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, వెంకటాచలం: మండలంలోని కసుమూరులో కాలేషాపీర్ మస్తాన్‌వలీ దర్గా ఉంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో దర్గా కార్యకలాపాలు సాగుతుంటాయి. వేలం పాటలు నిర్వహించి దర్గా హుండీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. వేలంపాట వాయిదా పడితే హుండీ నగదును వక్ఫ్ బోర్డు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో లెక్కించాల్సి ఉంది. గతేడాది హుండీ వేలంపాట జరగ్గా రూ.1.50 కోట్లకు వేలంపాటదారులు దక్కించుకున్నారు. దీని గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలోనే హుండీ నిర్వహణ సాగుతోంది. చర్యలు చేపట్టలేదు జనవరి 5వ తేదీ తర్వాత హుండీ వేలం గురించి వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించలేదు. వేలం నిర్వహణకు సంబంధించి పలువురు కాంట్రాక్టర్లు వక్ఫ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హుండీలో భక్తులు కానుకలుగా వేసిన నగదును తొలిసారి 53 రోజులకు వక్ఫ్‌బోర్డు అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపు ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారనే విమర్శలున్నాయి. ఈ లెక్కింపులో రూ.7.50 లక్షలు వచ్చినట్లు బోర్డు అధికారులు చెప్పడంతో స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గోప్యంగా ఉంచడంతో.. రెండో దఫాగా ఈనెల 12వ తేదీన 70 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే లెక్కింపు ప్రారంభమైన తర్వాత స్థానికులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని వక్ఫ్ బోర్డు అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హుండీ నగదును పక్కదారి పట్టించేందుకే రహస్యంగా లెక్కింపు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. స్థానికులు ఆందోళన చేస్తున్న సమయంలోనే హుండీ లెక్కింపు వీడియో తీసుకున్న ప్రైవేట్ వ్యక్తికి బోర్డు సూపరింటెండెంట్ రూ.5 వేలు నగదు ఇవ్వగా ఇతరుల చేత ఆ నగదును బయటకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, వీఆర్వోకు చెప్పడంతో ఆ నగదును వెనక్కి తీసుకువచ్చారు. మరో ఘటనలో.. ఓ వ్యక్తి హుండీ నుంచి కిందపోసిన నగదులో ఓ కట్టను తీసుకుని బయటకు వెళ్లగా స్థానికులు వెంబడించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని నగదును లెక్కింపు వద్దకు చేర్చారు. ఈ విషయాల ఆధారంగా హుండీ నగదు దోచేస్తున్నారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుండీ వేలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రతి ఏటా జనవరి నుంచి మే నెల వరకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు వచ్చేదని పలువురు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది జనవరి ఐదో తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు కేవలం రూ.19.75 లక్షలు వచ్చినట్లు చూపడంతో హండీ నగదు దోపిడీ చేస్తున్నారని అనేకమంది ఆరోపిస్తున్నారు. లెక్కింపు సమయంలో తప్పిదాలపై వక్ఫ్ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులోని కొందరు ఉన్నతాధికారులకు వాటా పంపుతుండడంతో వారు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు. పోలీసులు విచారిస్తున్నారు హుండీ లెక్కింపు సమయంలో ఓ వ్యక్తి నగదు కట్ట తీసుకెళ్లిన విషయం వాస్తవమే. పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు వెనక్కి తీసుకువచ్చారు. ఈ విషయంపై విచారిస్తున్నారు. హుండీ నగదు దోపిడీపై నాపై వచ్చే ఆరోపణలు అవాస్తవం. కెమెరామెన్‌కు రూ.5 వేలు ఇచ్చిన విషయం వాస్తవమే. కానీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకున్నాం. – అహ్మద్‌బాషా, దర్గా సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయలేదు హుండీ లెక్కింపు వద్దకు పోలీస్ సిబ్బందిని పంపాం. అక్కడ ఏం జరిగిందనే విషయంపై వక్ఫ్ బోర్డు అధికారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అందువల్ల విచారణ జరపలేదు. – షేక్ కరీముల్లా, ఎస్సై -
కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు
వెంకటాచలం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు దర్గాను ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శుక్రవారం దర్శించుకున్నారు. కసుమూరు దర్గా గంధోత్సవానికి కొన్నేళ్ల నుంచి ఏఆర్ రెహమాన్ వస్తున్నారు. అందులోభాగంగా ఇక్కడకు వచ్చిన రెహమాన్‌కు తొలుత దర్గా ముజావర్లు ఘన స్వాగతం పలికారు. ఆయనకు పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు. -
గంధమహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
నెల్లూరు రూరల్: కసుమూరు దర్గా గంధమహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కసుమూరు దర్గా ఉత్సవంపై సంబంధిత అధికారులతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాచలం మండలం కసుమూరు దర్గా గంధమహోత్సవాన్ని ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవం పూర్తయ్యేంత వరకు కసుమూరులో మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు చెప్పారు. పారిశుధ్య మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ, దర్గా కమిటీ, మండల నిధులను ఖర్చు పెట్టాలని తెలిపారు. రొట్టెల పండగ సందర్భంగా ఉపయోగించిన తాత్కాలిక టాయ్లెట్లను తీసుకెళ్లి ఏర్పాటు చేయాలన్నారు. మంచినీటికి కొరత లేకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసులకు సూచించారు. మండల రెవెన్యూ, పోలీస్, వక్ఫ్‌బోర్డు అధికారులు, దర్గా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
కసుమూరు దర్గాలో భక్తుల కోలాహలం
సౌకర్యాలు కల్పనలో వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం భక్తులకు అవస్థలు కసుమూరు (వెంకటాచలం): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలి దర్గా ప్రాంగణం బుధవారం భక్తులతో కోలాహలంగా మారింది. నెల్లూరునగరంలోని బారాషహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరులోని మస్తాన్‌వలి దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. మంగâ¶వారం రాత్రి నుంచి భక్తులు మస్తాన్‌వలి దర్గాను దర్శించుకుంటున్నారు. దర్గాలోని మస్తాన్‌వలి సమా«ధి వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో దర్గాకు వేలాది మంది భక్తులు రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు కసుమూరు దర్గాను సందర్శించారు. భక్తులకు ఏటా తప్పని అవస్థలు కసుమూరు దర్గాకు వచ్చే భక్తులకు ఏటా అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రోడ్డుమార్గంలో ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్న రోడ్డు కుదించుకుపోయింది. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు ఇరుకురోడ్డుపై రాకపోకలు సాగేంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు అటూ, ఇటూ తిరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆటోలను పోలీసులు లోపల అనుమతించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వసతులేవీ? కసుమూరు దర్గాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. వక్ఫ్‌బోర్డు బుధవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వీధులను మాత్రం శుభ్రం చేయించారు. దర్గా ప్రాంగణంలో షామినాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మధ్యాహ్నం వరకు దర్గాను సందర్శించుకునే భక్తులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సరఫరా కేంద్రాలు కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వక్ఫ్‌బోర్డు వసతులు సక్రమంగా కల్పించక పోవడంతో భక్తులు పొలాల గట్లుపై చెట్ల కింద సేదతీరారు. దర్గా సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా భక్తుల సౌకర్యాల కోసం వక్ఫ్‌బోర్డు రూ.లక్ష కేటాయించారని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు.