Published
Sun, Sep 11 2016 10:39 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
ఆలయంలో ఘనంగా విశేష పూజలు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా బాలాలయంలో నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, అర్చన, సహస్రనామార్చన, సుదర్శన హవనం వంటి విశేష పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 3 గంటలకే తెరిచి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఆలయంలోని స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకించారు. పట్టు వస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక పీఠంపై అధిష్టింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో ప్రత్యేక పూజలను చేసిన అనంతరం హారతిని సమర్పించారు. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు గావించారు. కోడే మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, నరిసింహాచార్యులు, రంగాచార్యులు, ఆలయ అధికారులు చంద్రశేఖర్, గోపాల్ పాల్గొన్నారు.