ఆర్టీసీ ఆర్‌ఎం రఘునాథ్‌రావు
- ఒక ఊర్లో 30 మంది ఉంటే ఆదే గ్రామానికే బస్సు
- పుష్కరాల కోసం మెదక్ రీజియన్ నుంచి 424 ప్రత్యేక బస్సులు
- ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. భక్తులకు శుభప్రదం
- ప్రతి భక్తుడు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్నే ఎంచుకోవాలి
- ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రఘునాథ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కృష్ణా పుష్కరాల కోసం ఒక గ్రామం నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే వాళ్ల సొంత గ్రామానికే బస్సు పంపుతామని, భక్తులు కోరిన పుష్కర ఘాట్‌కు తీసుకువెళ్లి.. భక్తులు స్నానమాచరించిన తరువాత మళ్లీ ఇళ్ల వద్ద వదులుతామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రఘునాథరావు చెప్పారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లా నుంచి పుణ్య స్నానాలకు భక్తులు తరలివెళ్లనున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రత్యేక బస్సుకు ప్రయాణికుల వద్ద నిర్ణీత టికెట్ ధర మాత్రమే తీసుకుంటామని, మిగిలిన సీట్లను ఆయా గ్రామాల మధ్య నింపుకొంటామని చెప్పారు. తెలంగాణ కృష్ణా పుష్కరాలలో ఆర్టీసీ భక్తులకు సురక్షిత, శుభప్రదమైన ప్రయాణాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు. ప్రతి భక్తులు ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సాక్షి: జిల్లా నుంచి ఎన్నిబస్సులు నడుపుతారు? ఎప్పటి వరకు నడుపుతారు?
ఆర్‌ఎం: పుష్కరాల కోసం మెదక్ రీజియన్ నుంచి 424 డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను సిద్దం చేశాం. అవసరమైతేæ బస్సుల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఆగస్టు 12 నుంచి ప్రారంభించి కృష్ణా పుష్కరాలు ముగిసే వరకు అంటే ఆగస్టు 23 వరకు బస్సు సర్వీసులు ఉంటాయి.
సాక్షి: ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి?
ఆర్‌ఎం: జిల్లాలో ప్రస్తుతం 7 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలోని అన్ని ప్రధాన బస్‌స్టేషన్ల వద్ద నుంచి 260 బస్సులు నడుస్తాయి. ఇవికాక పటాన్‌చెరు, లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట ప్రాంతాల నుంచి మరో 164 బస్సులను ప్రత్యేకంగా నడుపుతాం. బీచ్‌పల్లి, వాడపల్లి, మట్టపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్, కొల్లాపూర్, అమరగిరి ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీని బట్టి ప్రయాణికుల కోరక మేరకు పుష్కర ఘాట్లకు తీసుకువెళ్తాం.
సాక్షి: టికెట్ ధరలు ఎలా నిర్ణయించారు?
ఆర్‌ఎం: టికెట్ ధర ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం.. స్టార్టింగ్ పాయింట్ నుంచి పుష్కర ఘాట్ మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్ ధర నిర్ణయిస్తాం. మొత్తానికి సామాన్య భక్తులకు భారం కాకుండా టికెట్ ధర ఉంటుంది.
సాక్షి: టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? రిజర్వేషన్ లేకుంటే ప్రయాణం ఉండదా?
ఆర్‌ఎం: టికెట్ బుకింగ్ కోసం ప్రధాన బస్ స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్‌లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి టికెట్ రిజర్వేషన్లు లేకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చిన భక్తుల కోసం సమీప బస్టాండ్ ఆవరణలో పుష్కర ప్రత్యేక బస్సులు సిద్దంగా ఉంటాయి.