శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
-
టికెట్ కౌంటర్‌ను ప్రారంభించిన ఈడీ
నెల్లూరు (టౌన్): శబరిమలై, పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. నగరంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో–1 ఆధ్వర్యంలో శబరిమలై, పంచారామ క్షేత్రాలకు సంబంధించి ప్రత్యేక టికెట్ కౌంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శబరిమలైకు ఒకేసారి 15 టికెట్లను కొనుగోలు చేస్తే ఒకరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.బస్సు బుక్ చేసుకున్న అయ్యప్పలకు ఇద్దరు వంటవాళ్లు, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. శబరిమలై, పంచారామ క్షేత్రాలకు అన్ని వర్గాల ప్రయాణికులకు అనుకూలంగా సూపర్‌లగ్జరి, శబరిమలై నాలుగు రోజుల ప్యాకేజీ టూర్‌లో భాగంగా రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కొరికి సూపర్‌లగ్జరీ బస్సుకు రూ.3,300, అల్ట్రాడీలక్స్‌కు రూ.3,300 ఎక్స్‌ప్రెస్‌కు రూ.2,500, తెలుగువెలుగుకు రూ.2వేలుగా నిర్ణయించినట్లు చెప్పారు. శబరిమలై యాత్రకు నెల్లూరు బస్టాండ్ నుంచి నవంబర్ 16,19,21,24, డిసెంబరు 1,4,6,9,10,15,18,20,23,31, జనవరి 4,7,11 తేదీల్లో ఉదయం 10 గంటలకు బస్సులు బయలు దేరుతాయని తెలిపారు.
పంచారామ క్షేత్రాలకు
పంచారామ క్షేత్రాలైన అమరారామం, సోమేశ్వరామం, క్షీరారామం, భీమేశ్వరం, కొమరారామంకు నెల్లూరు బస్టాండ్ నుంచి ప్రతి ఆదివారం రాత్రి బస్సులు బయలు దేరుతాయని ఆర్టీసీ ఈడీ తెలిపారు. సూపర్‌లగ్జరికు రూ.1950, డీలక్స్‌కు రూ.1875గా టికెట్ చార్జి నిర్ణయించినట్లు వివరించారు. ఈ నెల 30, నవంబర్ 11, 13, 20 తేదీల్లో బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. వివరాలకు 73829 96410, 99592 25641, 73828 83003, 99592 25653, 0861 2323333 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవివర్మ, డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జయరామసుబ్బారెడ్డి, డిపో మేనేజర్లు శీనయ్య, మురళీ, తదితరులు పాల్గొన్నారు.