‘హోదా’తోనే రేపటి వెలుగు
-
కుమ్మక్కై అన్యాయం చేసిన టీడీపీ, బీజేపీ
-
ఆది నుంచీ పోరాడుతున్నది వైఎస్సార్ సీపీయే
-
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్ :
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకు ఒడిగట్టాయన్నది నేడు నిజమైందని విమర్శించారు. గురువారం సాయంత్రం సర్పవరం జంక్షన్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. టైర్లు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇస్తే.. కాదు పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు రాజ్యసభలో డిమాండ్ చేశారని, 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం, దానికి చంద్రబాబు వంత పాడిన తీరు చూస్తే ఆశ్చర్యమేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని, ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రస్తుతం మంత్రి ప్యాకేజీల రూపంలో ప్రకటించి అంశాలన్నీ ఉన్నాయన్నారు. చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా దక్కకుంటే భావితరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై ఢిల్లీలో, గుంటూరులో నిరాహారదీక్షలు చేపట్టి, కాకినాడలో ప్రత్యేక ఆందోళనలు నిర్వహించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన చంద్రబాబు వైఖరిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. టీడీపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొనేందుకుమిత్రపక్షంపై ఒత్తిడి తీసుకురావడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
స్తంభించిన ట్రాఫిక్
ఆందోళన సందర్భంగా రెండు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువత కార్యదర్శి లింగం రవి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, కాకినాడ నగర మైనారీటీ సెల్ అధ్యక్షుడు అక్బర్ అజామ్, జిల్లా పార్టీ ఎస్సీ విభాగం నాయకులు చెల్లే శేషారావు, జంగా గగారిన్, జిల్లా బీసీ విభాగం కార్యదర్శి విత్తనాల రమణ, మత్స్యకార సంఘ నాయకులు చొక్కా జగన్, గరికిన అప్పన్న, మాజీ సర్పంచులు కోమలి సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు వరసాల జాన్‌ప్రభాకర్, రమణాతి మురళి, అనుసూరి ప్రభాకరరావు, పార్టీ నాయకులు ముత్యాల సతీష్, కడియాల చినబాబు, శెట్టి బాబూరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రేపటి బంద్‌కు సహకరించాలి
ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం మాట తప్పినందుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు. హోటళ్లు, బ్యాంకులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులను డిపోల్లోనే నిలిపివేయాలన్నారు. బంద్ విజయవంతానికి పార్టీశ్రేణులు పూనుకోవాలన్నారు. బంద్‌ను విజయవంత చేసేందుకు అన్ని వర్గాలు, పార్టీలు, స్వచ్ఛందసేవా సంస్థలు, కార్మిక సంఘాలు కలసి రావాలని కోరారు.
‘హోదా’ ఇచ్చే వరకూ కదనం ఆగదు..
రాయవరం :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ తమ పార్టీ పోరాడుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు. రాయవరం మండలం సోమేశ్వరంలో గురువారం జరిగిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత నిమ్మకాయల దోసారావు సంతాపసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎందుకు నిలదీయలేక పోతున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని టీడీపీ మంత్రులతో తక్షణం రాజీనామా చేయించాలన్నారు. ముఖ్యమంత్రి స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కన్నబాబుతో పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులున్నారు.