‘ప్రత్యేక’ విద్య డల్!
5 నెలలుగా జీతాలు రాక ఉపాధ్యాయుల అవస్థలు
ఫిజియోథెరపిస్ట్‌లు, ఆయాల లేమితో నిర్వీర్యమవుతున్న వ్యవస్థ
ఆందోళనలో ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల తల్లిదండ్రులు
ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల మానసిక స్థితిని చక్కదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వనరుల విద్యా కేంద్రాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి పథకంలో సాగిన ఈ కేంద్రాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి దిగజారింది.
– తాడికొండ రూరల్
తాడికొండలో ఉన్న ప్రత్యేక విద్యావనరుల కేంద్రంలో ప్రస్తుతం 19 మంది చిన్నారులు ఉన్నారు. ఫిజియోథెరపిస్టు, ఆయాల కాంట్రాక్టు కాలపరిమితి పూర్తవడంతో తొలగించారు. ఆ పోస్టుల్లో ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉపాధ్యాయులే అన్నీ తామే నడిపించాల్సివస్తోంది. గదులను శుభ్రం చేసేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో కేంద్రం నిర్వహణ కష్టంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఫిజియోథెరపిస్ట్ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా చిన్నారులను కేంద్రానికి పంపించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. నిర్వహణ లోపంతో ఫ్లోరింగ్ కుంగిపోవడంతో ఇబ్బందిగా మారింది. జిల్లాలో మొత్తం 57 మండలాల్లో ఈ పాఠశాలలు కొనసాగుతుండగా కేవలం 19 మండలాల్లో మాత్రమే గత ప్రభుత్వ హయాంలో పక్కా భవనాలు మంజూరయ్యాయి. జిల్లా అంతటికీ ఫిజియోధెరపిస్ట్‌లు 13 మంది ఉండగా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకునే పద్ధతి పాటిస్తుండటంతో ఈ ఏడాది ఎక్కడా నియామకం చేయలేదు. ఆయాలను కూడా నియమించలేదు. ఫలితంగా ఉపాధ్యాయులే అన్నీ తామై నడిపిస్తున్నారు.
ఐదు నెలలుగా అందని జీతాలు..
ప్రత్యేక విద్యావనరుల కేంద్రాల్లోని ఉపాధ్యాయులకు (శిక్షకులు) 5 నెలలుగా జీతాలు అందడంలేదు. దీంతో పలువురు శిక్షకులు విధుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యావనరుల కేంద్రాలు మూతపడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పలువురు వికలాంగ బాలబాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సత్వరమే జీతాలు విడుదల చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం..
కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో కేంద్రాన్ని అప్పులు తెచ్చి కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చొరవతో జీతాలు వెంటనే విడుదల చేయాలి. చాలా ఇబ్బందిగా ఉంది.
– కత్తి నాగబాబు, ఉపాధ్యాయుడు, తాడికొండ
ప్రజాప్రతినిధులు చొరవ చూపిస్తే మరింత అభివృద్ధి..
ఈ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. ఎంతో మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల జీవితాల్లో ఈ కేంద్రాలు వెలుగు నింపుతున్నాయి. జీతాలు రాక మేం ఎంతో ఇబ్బంది పడుతున్నాం.
– మండ్ల యలమంద, ఉపాధ్యాయుడు, తాడికొండ