క్రీడలపై సర్వే క్రీనీడ
-
క్రీడలకు సాధికారిత సర్వే దెబ్బ
-
సర్వేలో వ్యాయామ ఉపాధ్యాయులు
-
క్రీడలకు దూరమైన విద్యార్థులు
-
భవిష్యత్ ప్రయోజనాలకు విఘాతం
రావులపాలెం:
క్రీడల అభ్యున్నతికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం క్రీడల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇటీవల ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజిత పతకం సాధించిన పీవీ సింధూకు కోట్ల రూపాయిలు నజరానా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తామని చేసిన ప్రకటనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి విద్యార్థులకు క్రీడల పరంగా పునాదిగా చెప్పుకునే స్కూల్ గేమ్స్ కాకినాడలో ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వానికి ముందు చూపు లేకనో లేక క్రీడల పట్ల నిర్లక్ష్యమే తెలియదుకాని ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సాధికారిత సర్వే(పల్స్ సర్వే)కు వ్యాయామ ఉపాధ్యాయులను కూడా హాజరుకావాలని ఆదేశించింది.
పోటీల సమయంలో సర్వే విధులు
వ్యాయామోపాధ్యాయులు జూలై నెల నుంచి సర్వేలో నిమగ్నం కావడంతో విద్యార్థులు క్రీడలకు దూరమయ్యారు. ఈ ఏడాది స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎప్‌ఐ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించిన స్కూల్ గేమ్స్‌కు జిల్లాలోని చాలా పాఠశాలల నుంచి విద్యార్థులు శిక్షణ లేక హజరు కాలేకపోయారు. అలాగే వచ్చే నెలలో జరిగే గ్రిగ్ క్రీడా పోటీలకు కూడా విద్యార్థులకు శిక్షణ కరువైంది. ప్రతీ ఏటా సెప్టెంబర్ నెలలో నిర్వహించే స్కూల్ గేమ్స్‌కు జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేట్ పాఠశాల నుంచి వేలాది మంది విద్యార్థులు 29 క్రీడాంశాల్లో అండర్–14, అండర్–17 బాలబాలిక విభాగాల్లో తమ ప్రతిభ కనబర్చేందుకు పోటీలకు హజరవుతారు. వీరిలో నైపుణ్యం కనబర్చిన సుమారు 800 మంది విద్యార్థులను ఆయా క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు రాష్ట్ర స్థాయిలోను ప్రతిభ చూపిన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అయితే జూలైలో చేపట్టిన పల్స్ సర్వే ప్రసుత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటి పేజ్ ఈనెల 25 వరకూ జరిగింది. రెండో పేజ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు ఆ సర్వేలోనే మునిగి తేలుతుండటంతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే కాకినాడలో 29 క్రీడాంశాలకు గాను 25 క్రీడాంశాల్లో పోటీలు ముగిశాయి. దీంతో ఈ ఏడాది ప్రతిభ ఉన్న స్కూల్ గేమ్స్‌కు దూరమైన క్రీడాకారులు చాలా మంది ఉన్నారు.
నష్టపోయిన విద్యార్థులు
స్కూల్ గేమ్స్‌లో ప్రతిభ కనబర్చినవారికి ఇచ్చే మెరిట్ సర్టిఫికేట్ల ద్వారా భవిష్యత్‌లో ట్రిపుల్ ఐటీ, ఎంసెట్, పాలిటెక్నిక్ తదితర విద్యా అవకాశాల్లో స్పోర్ట్స్ కోటాలో సీట్లు పొందేందుకు అవకాశం ఉంది. అలాగే జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగ అవకాశాల కూడా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ అవకాశాన్ని చాలా మంది కోల్పొయారు. కాగా వచ్చే నెలలో లక్షలాది రూపాయిలు వెచ్చించి నిర్వహించే జోనల్, సెంట్రల్ జోన్ గ్రిగ్ పోటీలకు కూడా విద్యార్థులకు శిక్షణ కరువైంది. దీంతో ఆ పోటీలకు ఎలా వెళ్లాలో తెలియక విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
కొత్తపేట నియోజకవర్గంలో....
కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలకు సంబంధించి గతేడాది 65 మంది విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య 30 లోపే ఉంది. ప్రసుత్తం పరిస్థితికి ఇదే నిదర్శనం. రావులపాలెం మండలంలో ఫుట్‌బాల్, నెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, కొత్తపేట మండలంలో బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, సాఫ్ట్‌బాల్, ఆత్రేయపురం మండలంలో వాలీబాల్, కబడ్డీ, ఆలమూరు మండలంలో ఫుట్‌బాల్, హ్యేండ్‌బాల్, కబడ్డీ క్రీడాంశాల్లో ఎక్కువ మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు. వీరిలో ఈ ఏడాది చాలా పాఠశాల విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు లేక స్కూల్ గేమ్స్‌కు హాజరుకాలేకపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్రీడ ప్రాముఖ్యతను గుర్తించి సర్వే నుంచి వ్యాయామ ఉపాధ్యాయులను మినహాయించి స్కూల్ గేమ్స్‌లో మిగిలిన క్రీడాంశాలకు, గ్రిగ్ పోటీలకు విద్యార్థులను సిద్ధం చేసేలా చర్యులు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వ్యాయమ ఉపాధ్యాయుల విధులు
సాధారణంగా వ్యాయామ ఉపాధ్యాయులు విధులు ఈ విధంగా ఉంటాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకూ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ మొత్తం ఆరు పిరియడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిరియడ్లలో పాఠశాల అసెంబ్లీ, ఆరోగ్య విద్య ఆరు ఏడు తరగతులకు ఫిజికల్ లిటరసీ, ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు ఫిజికల్ లిటరసీ, పాఠశాల అనంతరం ప్రత్యేక సమయంలో క్రీడలకు శిక్షణ నిర్వహిస్తుంటారు. అయితే సర్వే దెబ్బకు వ్యాయామ ఉపాధ్యాయలు లేక ప్రసుత్తం చాలా పాఠశాలల్లో ఇవి కానరావడం లేదు.