జాతీయస్థాయి పతకంపై గురి
టేబుల్‌టెన్నిస్‌లో రాణిస్తున్న శ్రేష్ఠ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురానికి చెందిన శ్రేష్ఠ టేబుల్ టెన్నిస్ జాతీయస్థాయి క్యాడెట్ బాలికల విభాగంలో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గత ఏడాది జూలై నుంచి తన విజయ పరంపర కొనసాగింది. రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి జాతీయ స్థాయిలో చోటు సంపాదించింది. ఈసారి జాతీయస్థాయిలో పతకం సాధించి తీరుతానన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
టేబుల్ టెన్నిస్‌పై మక్కువ
తన ఇంటి వద్ద ఉన్న నాగశ్రావణి ఆటను చూసి తనలాగా తానూ క్రీడాకారిణి కావాలని శ్రేష్ఠ 2014లో పీస్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో చేరింది. 2015లో టోర్నీల్లో పాల్గొంది. 2016 జూలైలో గుంటూరులో జరిగిన టోర్నీలో టైటిల్ సాధించింది. దీంతో మొదటిసారి పతకం అందుకుంది. అనంతరం రాజమండ్రిలో జరిగిన టోర్నీలోనూ టైటిల్ సాధించింది. అనంతపురం లో జరిగిన టోర్నీలో స్వల్ప ఆధిక్యతతో రన్నరప్‌గా నిలిచింది. భీమవరంలో రన్నరప్‌గా నిలిచింది. అనంతరం ఏలూరులో జరిగిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రాష్ట్రస్థాయిలో టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్‌ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. దీంతో రాష్ట్రస్థాయి సెలెక‌్షన్ కమిటీ సభ్యులు తన ఆట తీరును చూసి జాతీయస్థాయి టోర్నీకి ఎంపిక చేశారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ శిక్షణతోనే..
శ్రేష్ఠ తల్లి లేఖ గృహిణి, తండ్రి అనిల్ కుమార్ సివిల్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, షటిల్‌ప్లేయర్ అయిన నాన్నమ్మ కళ స్ఫూర్తితో ఆటలో రాణిస్తున్నానని శ్రేష్ఠ చెప్పింది. కోచ్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన కోచింగ్ తాను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడానికి ఎంతగానో తోడ్పడిందని పేర్కొంది.