గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా..
అనంతపురం కల్చరల్: గతి తప్పిన జగతిని ప్రగతి మార్గాన నడిపించడానికి మానవ అవతారమెత్తి, ఆధ్యాత్మిక భావసంపదను పాదుకొల్పి జగద్గురువుగా భాసిల్లుతున్న కృష్ణ భగవానుని జన్మాష్టమి వేడుకలు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఈనేపథ్యంలో వివిధ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు వారు నిర్వహిస్తున్న కృష్ణమేళాలు అందరికీ గోకులాన్ని సాక్షాత్కరింపచేస్తున్నాయి. అపశకునాలుగా భావిస్తున్న అష్టమి రోజున పుట్టడం, చెరశాల జన్మస్థానం కావడం, నల్లని వాడుగా ఉండటం.. ఇవేవీ తిరోగమనాలు కావని, భవిష్య తరాల వారికి ఘనమైన వారసత్వ సంపదనందించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని నగరంలో కోలాహలంగా జరుపుకొంటున్నారు.
ఇస్తాన్ మందిరంలో సోమవారం విశ్వశాంతి యజ్ఞం, విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నారుల కృష్ణ వేషధారణలుంటాయి. మంగళవారం మహాభిషేకంతో పాటు ఉట్టి ఉత్సవాలు, పుష్పాభిషేకం జరుగుతాయి. అదేవిధంగా ఆర్‌ఎఫ్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణపరివారం, నృత్యకళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో సాగే ‘కృష్ణమేళా’లో చిన్నారులు సాక్షాత్తు చిన్ని కృష్ణుని తలపిస్తూ ఆనంద తాండవం చేస్తారు. అలాగే వాడవాడలా కృష్ణ మందిరాలు శోభాయమానంగా, విద్యుద్దీపకాంతులతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు, కళాక్షేత్రాల్లో సంప్రదాయంగా సాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ శిష్యులు శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారని నృత్య విద్వాంసురాలు సంధ్యామూర్తి తెలిపారు.
ధర్మ సంస్థాపన కోసమే అవతరించాడు : దామోదర్ గౌరంగదాస్, ఇస్కాన్ మందిరం
జగతికి వింత శోభను కూర్చడానికి కృష్ణుడు ఉద్భవించాడు. పురాణ పురుషుడైన దేవదేవుడు మానవ రూపంలో ఉన్నందున ఎన్నో అపనిందలు భరించాడు. విజయ తీరాలకు చేరడానికి భక్తి మార్గమొక్కటే అని నిరూపించిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో వేలాది మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం.
మాకు చాలా ప్రత్యేకం : సుధాప్రజ్ఞ, విద్యార్థిని, అనంతపురం
కృష్ణాష్టమి సందర్భంగా అనేక అనేక కోలాటాల్లో పాల్గొన్నాం. దానికి గుర్తింపుగా ఈనెల 15న మా బృందంతో కలిసి తిరుపతిలో ప్రత్యేక అవార్డు అందుకుంటున్నాం. దీంతో ఈకృష్ణాష్టమి మాకు ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నాం.