శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్లో మరో జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని శ్రీలక్ష్మీశ్రీనివాస జూట్మిల్లుని మూసివేస్తున్నట్లు ఆ మిల్లు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. దీంతో మిల్లులో పని చేస్తున్నకార్మికులంతా ఉదయమే జూట్మిల్లు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లాకౌట్పై ముందస్తు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం మిల్లును అర్థాంతరంగా మూసివేసిందని కార్మికులు ఆరోపించారు. యాజమాన్యం వైఖరిని కార్మికులు తప్పుపట్టారు.
యాజమాన్యం చర్యలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులను శాంతింప చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ క్రమంలో పోలీసులు... కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే గుంటూరు నగరంలోని భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.