మొక్కలు నిండి ఇలా పూత , రెండో అంతస్తుపై డ్రాగన్ తోట
రాజాం: ఆయనొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వ్యవసాయమంటే మక్కువ. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తల్లిదండ్రుల సాయంతో విదేశాల్లో బాగా కలిసివస్తున్న డ్రాగన్ పంట సాగుపై దృష్టిసారించాడు. ఆ పంటకు ఇక్కడ ఉన్న డిమాండ్ గుర్తించాడు. వేసిన పంట ద్వారా ఫలసాయం పొందాలని భావించాడు. ఏకంగా తన ఇంటి డాబానే వ్యవసాయ క్షేత్రంగా మలిచాడు. వందకు పైగా మొక్కలు నాటాడు. సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. డ్రాగన్ తోట ఏపుగా పెరిగి దిగుబడి ఆరంభం కావడంతో... కష్టం ఫలించిందంటూ సంబరపడుతున్నాడు. ఆయనే రాజాం పట్టణం పరిధిలోని డోలపేట గ్రామానికి చెందిన సుదర్శనం అధికారి.
ఆరు సెంట్ల విస్తీర్ణంలో...
సుదర్శనం అధికారి విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి రకరకాల పంటలు సాగుచేయడమంటే ఇష్టం. తల్లిదండ్రులు నర్సమ్మ, శాంతిమూర్తిల ప్రోత్సాహంతో కొంత పొలాన్ని కొనుగోలుచేసి మామిడితోటలు, జీడితోటలతో పాటు పొలాలు, ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు సాగుచేస్తుంటాడు. అదే క్రమంలో కోవిడ్ సమయంలో ఇంటి డాబాపై డ్రాగన్ పంట సాగుకు పూనుకున్నాడు.
25 స్తంభాలు ఏర్పాటుచేసి ఆరుసెంట్లు విస్తీర్ణంలో ఉన్న డాబాపై వందకుపైగా డ్రాగన్ మొక్కలు 2020లో నాటాడు. గతేడాది జూలై నెలలో పూతకు వచ్చాయి. ఒక్కో మొక్కకు 12 నుంచి 15 వరకూ డ్రాగన్ పండ్లు దిగుబడి రావడంతో పాటు నాలుగు నెలలు పాటు పూత సాగింది. ఒక్కొక్కటి 800 గ్రాముల నుంచి 900 గ్రాముల బరువు ఉన్న పండ్లు దిగుబడి వస్తున్నాయి. పోషకాలు మెండుగా ఉన్న డ్రాగన్ పండ్ల కొనుగోలుకు ప్రస్తుతం అధికమంది ఆసక్తిచూపుతున్నారు.
నిరంతరం ఇద్దరు..
పొలం, ఇంటి వద్ద మొక్కల సంరక్షణకు ఇద్దరు రైతు కూలీలను నియమించాడు. ప్రతీ రెండు రోజులకు డ్రాగన్ మొక్కలకు నీరు పెట్టడం, ఏపుగా పెరిగిన కొమ్మలు తొలగించడం, పేడ గత్తం, వేప ఆకులతో సేంద్రియ ఎరువు తయారుచేసి మొక్కలపై పిచికారీ చేయడం వంటి పనులను వారు చక్కబెడుతున్నారు. డ్రాగన్ తోట సాగుతో ఇల్లు కూడా చల్లగా ఉంటోందని ఆయన చెబుతున్నారు.
అభిరుచితోనే...
మా ఇంటిపై ఏవో మొక్కలు వేద్దామని అనుకున్నాను. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ కావడంతో ఆలోచన వచ్చింది. నెట్‌లో చెక్‌చేసి డ్రాగన్ తోటలుపై దృష్టిసారించారు. ఖమ్మం నర్సరీతో పాటు రేగిడి మండలం కాగితాపల్లి వద్ద దూబ రమేష్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాం. రూ.2 లక్షలు వెచ్చించి తోట వేశాం. ఇప్పుడు ఇవి అందంగా ఉండడంతో పాటు సీజన్‌లో మంచి పూత వస్తోంది. గతేడాది రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది.
– సుదర్శనం అధికారి, డోలపేట
Comments
Please login to add a commentAdd a comment