శ్రీరంగ.. రంగా..!
* జీర్ణావస్థలో తిమ్మాయపాలెం రంగనాయకస్వామి ఆలయం
* కనీసం పాలకవర్గమైనా లేదు..
వినుకొండ రూరల్: పురాతన చరిత్ర కలిగిన దేవాలయం... ఆలయ నిర్వహణకు 60 ఎకరాల భూములు ఉన్నాయి. ఏటా దాదాపు రూ.2 లక్షల కౌలు వస్తుంది. ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నా... ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ పాలకవర్గం ఏర్పాటు కూడా చేయలేదు. కనీస వసతి సౌకర్యాలు కల్పిస్తే భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది.
మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగనాయకస్వామి దేవాలయం ఆస్తులు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. రంగనాయకస్వామి దేవస్థానం ఆవరణలో కృష్ణదేవరాయల కోనేరు, దేవస్థానానికి ఎదురు కొండపై నరసింహస్వామి గుడి ఉంది. రంగనాయకస్వామి పాదాలు, వెంకటరాయుని దేవస్థానం, లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా నమస్కరిస్తున్న ఆంజనేయస్వామి చేతులపై సీతాసమేత రాముల వారి విగ్రహాలు ఇచ్చట కొలువుదీరి ఉన్నాయి. తిమ్మాయపాలెం గ్రామ సమీప ప్రాంతంలో రంగనాయకస్వామికి 61.07 ఎకరాల భూమి ఉంది. ఏటా రైతులు రూ.1.75 లక్షల కౌలు చెల్లిస్తారు. అయినా దేవస్థాన అధికారులు మాత్రం ఈ దేవస్థానం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వసతులు కల్పించాలి..
దేవాలయానికి వెళ్లే భక్తులకు కనీసం కాళ్లు కడుక్కునేందుకు నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో దేవాలయానికి వెళ్లాలంటే భక్తులు సంకోచిస్తున్నారు. దేవాలయానికి ప్రహరీతో పాటు వాచ్‌మెన్ సౌకర్యం కల్పిస్తే దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
పురాతన దేవాలయాలకు ట్రస్ట్‌లు లేవు..
నియోజకవర్గంలోని అనేక పురాతనమైన దేవాలయాలకు ఆస్తులు ఉన్నా, వాటి నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ట్రస్ట్‌లు మాత్రం కరువయ్యాయి. గ్రామస్తులు చొరవ చూపకపోవడమే ఇందుకు కారణమని దేవాదాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లోని ప్రజలు రాజకీయ వైషమ్యాలను వదలి ట్రస్ట్‌గా ఏర్పడి చరిత్రకు మారుపేరుగా నిలిచిన దేవాలయాలను పునఃప్రతిష్టించాల్సిన బాధ్యత భక్తులపై ఉందని సూచిస్తున్నారు.