నేటి నుంచి శ్రీశెలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
► 11 రోజుల పాటు నిర్వహణ.. 7న కల్యాణోత్సవం
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం నుంచి మార్చి 10వ తేదీవరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈవో సాగర్‌బాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ వాహన సేవలు ఉంటాయన్నారు.
మార్చి 7న మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, కళ్యాణ మహోత్సవం జరుగుతాయన్నారు. 8వ తేదీన రథోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 9వ తేదీన పూర్ణాహుతి..10వ తేదీన అశ్వవాహనసేవ, పుష్పోత్సవ, శయనోత్సవ సేవలు ఉంటాయన్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం:9.15 గంటలకు యాగశాల ప్రవేశం, గణ పతి పూజ ఉంటాయన్నారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ జరుగుతుందన్నారు. మార్చి 4న రాష్ట్రప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా అదేరోజు పట్టువస్త్రాలను సమర్పిస్తారని పేర్కొన్నారు.